సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరులో పండిన బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఇక్కడి దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి తమ ప్రాంతానికి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. తమిళనాడులో రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన బాయిల్డ్ బియ్యాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి సేకరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని రైస్‌మిల్లర్ల నుంచి ఈ బియ్యాన్ని సేకరిస్తోంది. మొదటి విడతలో 3,300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
పోటీ పడుతున్న రైస్ మిల్లర్లు..
ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఏజెంట్‌గా వ్యవహరించనుంది. ఇందుకు గాను తమిళనాడు మన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు క్వింటాలుకు రూ.31 చొప్పున కమీషన్ చెల్లించనుంది. గ్రేడ్–ఏ బియ్యానికి టన్నుకు రూ.2,670 చొప్పున, కామన్ రకానికి రూ.2,610 చొప్పున కొనుగోలు చేయాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ ధరకు విక్రయిస్తే పెద్ద మొత్తంలో లాభాలుండటంతో దొడ్డుబియ్యాన్ని విక్రయించేందుకు మిల్లర్లు పోటీ పడుతున్నారు.
తాము విక్రయిస్తామంటే తాము విక్రయిస్తామంటూ మిల్లర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే బియ్యం సరఫరా చేసే మిల్లర్ల జాబితాను అధికారులు రూపొందించినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన పౌరసరఫరాల సంస్థ అధికారులే స్వయంగా జిల్లాకు వచ్చి ఈ సేకరణ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
మద్దతు ధర కంటే ఎక్కువగా..
నిబంధనల ప్రకారం ఈ బియ్యాన్ని సరఫరా చేయాల్సిన రైస్‌మిల్లరు కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.30 చొప్పున అదనపు రేటుకు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అంటే ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,590 ఉండగా, అదనంగా రూ.30 కలిపి మొత్తం క్వింటాలుకు రూ.1,620 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేయాలి. దీంతో రైతులకు కొంత ప్రయోజనం చేకూరుతుందని, మద్దతు ధర కంటే కాస్త అదనంగా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ బియ్యాన్ని సరఫరా చేసే రైస్‌మిల్లరు ఏ రైతు వద్ద కొనుగోలు చేశారు, ఆ రైతు వివరాలు, వారికి ధాన్యం డబ్బుల చెల్లింపులు (చెక్ నెంబర్).. ఇలా అన్ని వివరాలను పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో చాలా మంది రైస్‌మిల్లర్లు కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసి, ఇలా సర్కారుకు అంట గట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, సర్కారుకు ఎక్కువ ధరకు విక్రయించి పెద్ద మొత్తంలో దండుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
పౌరసరఫరాల సంస్థ ఈ బియ్యానికి సంబంధించి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపిన రైతులు, వారి చెల్లింపులను పకడ్బందీగా పరిశీలిస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దొడ్డుబియ్యాన్ని సరఫరా చేసేందుకు మిల్లర్ల జాబితాను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు పంపించామని ఆ సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. అనుమతి వచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment