► గ్రామాల్లో ఉపాధి పెంచేందుకు కృషి
► రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నేరడిగొండ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు కుల, చేతివృత్తులకు రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గృహ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం వడూర్ గ్రామంలో మంత్రి పర్యటించి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ శోభారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రామంలోని పురాతన నగరేశ్వరాలయ అభివృద్ధికి, మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేతి, కులవృత్తులపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణమైన అవగాహన ఉన్నందునా పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాల అభివృద్ధితో పాటు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్‌బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, రైతులకు మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. సర్కారుపై ఆరోపణలు చేయడం విపక్షాలు మానుకోవాలన్నారు. వడూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు వారు తెలిపారు. తహసీల్దార్ కూనాల గంగాధర్, ఎంపీడీవో మహ్మద్ రియాజొదీ్దన్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేశ్‌చక్రవర్తి, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, ఉపాధ్యక్షుడు చిల్కూరి లక్ష్మణ్, వీడీసీ అధ్యక్షుడు ఆదుముల్ల భూషణ్, టీఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, శంకర్, పోశెట్టి, పండరి, గంగారెడ్డి, రవీందర్, శంకర్, రాంపెదబాపు, రాములు, నారాయణ్‌సింగ్, జహీర్, భోజన్న, కమల్‌సింగ్, కపిల్‌దేవ్, పాల్గొన్నారు.
పంట మార్పిడితో అధిక లాభాలు
తలమడుగు (భీంపూర్): రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని, దీంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండలం ధనోర గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పత్తి, సోయాబీన్, జొన్న తదితర పంటలను ఏటా పండించడం ద్వారా దిగుబడి రాక నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి చేసి పసుపు, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలను వేయాలని సూచించారు.
ధనోర గ్రామంలోని గోవర్ధన్ యాదవ్, పంట మార్పిడితో పసుపు, అల్లం, మిర్చి సాగు చేసి అధిక దిగుబడి సాధించగా ఈ సందర్భంగా ఆయనను మంత్రి సన్మానించారు. గోవర్ధన్ యాదవ్‌ను రైతులంతా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి జిల్లాలో పసుపు మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాడిపరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, గ్రామ సర్పంచ్ శంకర్, తహసీల్దార్ రాజేశ్వర్, ఆత్మ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.