నయీం దందాపై సీబీఐ విచారణ జరిపించాలి
⇒ బీజేపీ జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి
హన్మకొండ: గ్యాంగ్ స్టర్ నయీం దందాలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగుచూస్తున్న అంశాల్లో ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారుల పేర్లు బయటకు వస్తున్నందున, నిష్పక్షపాతంగా, వాస్తవాలు ప్రజలకు తెలియజేసేలా సీబీఐ విచారణ చేయించాలన్నారు. రాష్ట్ర పోలీసుల విచారణపై సందేహాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు సందర్శనకు ఇతరులకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం.. మంత్రుల సమావేశాలకు మాత్రం అనుమతిస్తోందని, ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, వరంగల్ లేదా కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నేతలు రావు పద్మ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.