తెలంగాణలో పరిశ్రమల వెల్లువ
రెండేళ్లలో నాలుగు వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్
- రెండున్నర లక్షల మందికి ఉపాధి.. 76 వేల కోట్ల పెట్టుబడులు
- వచ్చే రెండేళ్లలో ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్
- 200 మెగావాట్ల ఆటోమేటిక్ సోలార్ ప్యానళ్ల తయారీ లైన్ ప్రారంభం
జిన్నారం (పటాన్‌చెరు): రెండేళ్లలో నాలుగు వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో 200 మెగావాట్ల ఆటోమేటిక్ సోలార్ ప్యానళ్ల తయారీ లైన్, సౌరశక్తి ఈ–వాహనాలను మంత్రి మహేందర్ రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ పరిశ్రమల ద్వారా ఇప్పటి వరకు రూ.76 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామని మంత్రి తెలిపారు.
ఇటీవల సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కును ప్రారంభించా మని, త్వరలో జిన్నారం మండలం శివానగర్‌లో ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకంలో భాగంగా నందిగామలో ఇప్పటికే మహిళా పార్కులను ఏర్పాటు చేశామని, సుల్తాన్‌పూర్‌లో మరో పార్కును ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం జిల్లాలలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన, సూర్యాపేటలో సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్ పార్కును, సిరిసిల్ల లో టెక్స్‌టైల్ రంగాన్ని అభివృద్ధి పర్చే ఉత్పత్తులు చేపడుతున్నామని తెలిపారు.
రెండేళ్లలో ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్
రెండేళ్లలో ఐదు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రీమియర్ సోలార్ పరిశ్రమ యాజమాన్యం రూ.100 కోట్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధిని కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభి స్తాయన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, సోలార్ మాడ్యూల్స్ తయారు చేసే విధానాన్ని ప్రీమియర్ సోలార్ పరిశ్రమ ఎండీ చిరంజీవ్ సింగ్ సలూజా మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ కేఎస్ పోప్‌లి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీపీపాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.