సంగారెడ్డిఅర్బన్ : గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ మహ్మద్ యూసుఫ్ బీన్ జాయిద్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతకుముందు ఆయనను రీజినల్ కోఆర్డినేటర్ పి.పాండురంగారెడ్డి ఆ«ధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ యూనిట్లను నెలకొల్పేందుకు బీసీలకు 10 శాతం మార్జిన్ మనీ ఉండగా ఇతరులకు ఐదు శాతం ఉందన్నారు.
మిగతా సబ్సిడీని బ్యాంకుల ద్వారా ఇస్తామన్నారు. మాంసంతో ముడిపడిన పరి«శ్రమ, పొగాకు, మద్యం, వాహనాలకు తప్ప మిగతా వాటికి సబ్సిడీ లోన్లు ఇస్తామన్నారు. గ్రామీణ ఉత్పత్తి పథకం కింద రూ.25 వేల నుంచి రూ.25 లక్షల వరకు రుణాలను అందజేస్తామన్నారు. స్ఫూర్తి ప్రోగ్రాంతో క్లస్టర్లవారీగా ఉమ్మడి జిల్లాలో రుణాలు ఇవ్వడానికి ఖాదీ బోర్డు సిద్ధంగా ఉందన్నారు. గ్రామ యూనిట్ గా గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. కోటి వరకు రుణా లు ఇస్తామన్నారు. త్వరలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్‌ల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల విభాగాల్లో ని«ధులు పుష్కలంగా ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం, బ్యాంకర్లు సహకరించకపోవడం, రాజకీయ కారణాలతో అర్హులైన వారు సబ్సిడీ రుణాలు పొందేందుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలోని ఔత్సాహికులు జిల్లా కేంద్ర కార్యాలయాల్లో సంప్రదించి సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ నాయకులు జావేద్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment