పూర్తి కాని విచారణ | inquiry not completed of social pension scheme | Sakshi
Sakshi News home page

పూర్తి కాని విచారణ

Published Fri, Nov 7 2014 2:08 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

inquiry not completed of social pension scheme

సాక్షి, మంచిర్యాల : సామాజిక భద్రతా (ఆసరా) పెన్షన్ల సర్వే.. విచారణ జిల్లాలో అసమగ్రంగా ముగిసింది. ఆహార భద్రత కార్డుల కంటే ముందుగా అర్హులైన పింఛన్‌దారులను గుర్తించి ఈ నెల 8 నుంచి పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత నెల 19న ప్రారంభించిన సర్వే.. విచారణను క్షేత్రస్థాయిలో అధికారులు మమ అనిపించారు. విచారణాధికారులు జిల్లాలో చాలా ప్రాంతాలకు వెళ్లకుండానే ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చేశారు. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతోపాటు దరఖాస్తు చేసుకోని మరెంతో మంది విచారణాధికారుల కోసం ఎదురుచూస్తున్నారు.

 జిల్లా అధికారులేమో విచారణ పూర్తయిందని.. ప్రస్తుతం కంప్యూటరీకరణ జరుగుతోందని ప్రకటిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో పేరు నమోదు కాకపోతే పింఛన్ రాదని తెలిసి కొందరు అర్హులు స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ఇంకొందరు మండలాధికారుల వద్దకు వెళ్లి విన్నవించుకుంటున్నారు.

 వితంతు పింఛన్‌పై మెలిక
 ఆది నుంచే.. టీ సర్కార్ వితంతు పింఛన్లకు మెలిక పెడుతూ వస్తోంది. గతంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే వితంతు పింఛన్‌కు అర్హులని ప్రకటించింది. దీంతో పదేళ్ల క్రితం చనిపోయిన తమ భర్తల మరణ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తెచ్చి సమర్పించాలని వితంతువులు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్న వాళ్లే సమర్పించాలని చెప్పింది. తాజాగా వితంతు మళ్లీ పెళ్లి చేసుకోలేదని సర్టిఫికెట్ ఇస్తేనే పెన్షన్ ఇస్తామని మెలిక పెట్టింది. ఇకపై ఏటా.. ఇలా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 సర్వే పూర్తయ్యింది..
 - వెంకటేశ్వర్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్
 జిల్లాలో సామాజిక పింఛన్లకు సంబంధించిన సర్వే, విచారణ పూర్తయింది. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల నుంచి మాకు నివేదికలు అందాయి. దరఖాస్తుదారుల వివరాలను కంప్యూటరీకరిస్తున్నాం. తాజాగా పెన్షన్ల అర్హత పరిమితి పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాలొచ్చిన తర్వాత మరింత మంది అర్హులను గుర్తిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement