సాక్షి, హైదరాబాద్: పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్ర తలు నెలకొన్నాయని, అందువల్లే తెలంగాణకు 4 వేల పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు శాఖపై ఖర్చు పెట్టిన ప్రతిపైసాకు పెట్టుబడులు, ఉపాధి కల్పన, అభివృద్ధి రూపంలో అంతకుమించి ఎన్నోరెట్ల ప్రతిఫలం వస్తోందని అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద శనివారం ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత తపాలా శాఖ ‘మై స్టాంపు’ పథకంలో భాగంగా అమరవీరుల స్మారకార్థం రూపొందించిన ప్రత్యేక తపాలా బిళ్లను, ప్రత్యేక తపాలా కవర్‌ను నాయిని ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు ఎంతో కీలకమని, ఇందులో భాగంగానే రాబోయే ఐదేళ్లలో శాంతి భద్రతలను మరింత సమర్థంగా నిర్వహించేలా పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంలో భాగంగా పోలీసుశాఖకు ఈ ఏడాది వెయ్యి కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అనుసరిస్తుండటం తో రాష్ట్రంలో నేరాల శాతం గణనీయంగా తగ్గింద న్నారు. భాగ్య నగరంలో దాదాపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొ న్నారు. తెలంగాణలో నేరం చేసి బయటకు వెళ్లలేమని నేరగాళ్లు భావించే విధంగా పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు.
అమరుల కుటుంబాలకు ఆపన్నహస్తం..
1959 అక్టోబర్ 21న భారత, చైనా సరిహద్దుల్లో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా దురాక్రమణ దారు లతో పోరాడుతూ కేంద్ర రిజర్వ్ పోలీసు దళానికి చెందిన ఎస్‌ఐ కరమ్‌సింగ్‌తోపాటు మరో పది మంది జవాన్లు వీరమరణం పొందారని, అప్పటి నుంచి ప్రతియేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నామని డీజీపీ అనురాగశర్మ అన్నారు.
అప్పటినుంచి ఇప్పటివరకు దేశ సరిహద్దుల్లో, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతో మంది అసువులు బాశారని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 383 మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటున్నామని, దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారి సేవలను జాతి ఎన్నటికీ మరువదని అన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment