సాంకేతికతతో ఆధారాలు పదిలం | Evidence will be Secure with technology | Sakshi
Sakshi News home page

సాంకేతికతతో ఆధారాలు పదిలం

Published Sat, Jun 23 2018 1:52 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Evidence will be Secure with technology - Sakshi

స్వర్ణలతకు అవార్డు అందజేస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, రాజీవ్‌ త్రివేది

సాక్షి, హైదరాబాద్‌: ఆధారాలు సేకరించడమే కాకుండా టెక్నాలజీ వినియోగంతో నిందితులను కటకటాల్లోకి పంపడం ఇప్పుడు సులభతరమైందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ పెరిగి ఆన్‌లైన్‌లోనే క్షణాల్లో విశ్లేషణ చేసి నిందితులను పట్టుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులుగా జరుగుతున్న 19వ జాతీయ స్థాయి ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో సదస్సు ముగింపులో నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫింగర్‌ప్రింట్స్‌ బ్యూరో సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం సంతోషకరమని, రాష్ట్ర పోలీస్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ డేటా మేనేజ్‌మెంట్, ఆటోమేషన్‌లో ది బెస్ట్‌ అని కితాబిచ్చారు. వచ్చే ఏడాది సదస్సుకల్లా తెలంగాణ ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో పూర్తి స్థాయి సిబ్బంది, అధికారులతో మరింత పటిష్టంగా మారుతుందని ఆకాంక్షించారు. ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో నిర్వహించిన పలు పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన తెలంగాణ ఫింగర్‌ ప్రింట్స్‌ అధికారిణి స్వర్ణలతకు ఆయన అవార్డు అందజేశారు. 

అన్ని విభాగాలు అందిపుచ్చుకోవాలి.. 
ఫింగర్‌ ప్రింట్‌ విభాగంలో పోలీస్‌ శాఖలోని అన్ని విభాగాలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. గతంలో ఆధారాల సేకరణ, విశ్లేషణ, ఫలితాల కోసం నెలల కొద్దీ సమయం పట్టేదని, ఇప్పుడలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. బ్రిటన్‌లాంటి దేశాల్లో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ఫింగర్‌ ప్రింట్‌ విభాగం అందుబాటులో ఉంటుందని, అలాగే రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నేరస్తుల ముఖం, పేర్లు మారినా వారి వేలిముద్రలు మాత్రం మారవని, అవే అత్యంత కీలకమైన ఆధారాలు అని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది అన్నారు. భవిష్యత్తులో కార్లను కూడా వేలిముద్రలతో అన్‌లాక్, స్టార్ట్‌ చేసే టెక్నాలజీ కూడా రాబోతోందని పేర్కొన్నారు. 

డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారినీ.. 
డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిని కూడా ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా గుర్తించేందుకు టెక్నాలజీ తీసుకొస్తున్నామని ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్‌ ఈష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఏర్పాటు, వాటి పురోగతికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు 92 శాతం పోలీస్‌ స్టేషన్లు అనుసంధానమయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే అనుసంధానం చేసి డేటాను షేర్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌ సింగ్, ఎన్‌సీఆర్‌బీ జాయింట్‌ డైరెక్టర్‌ సంజయ్‌మాతుర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement