నేరస్తులను పట్టుకునే ‘ఆధార్’o ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ఆధార్ లింక్‌ను ఉపయోగించుకోవాలనే పోలీసు శాఖ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆధార్ కోసం సేకరించిన వేలిముద్రల డేటాను ఉపయోగించుకుంటే నిందితులను పట్టుకోవడం, గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించడం సులభమవుతుందని పోలీసుశాఖ భావించింది. అయితే ఈ మేరకు ఆ శాఖ చేసిన ప్రతిపాదనను ఆధార్ ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. ఆధార్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున నిందితుల గుర్తింపు కోసం లింకేజీ ఇవ్వడం ఇప్పుడు సాధ్యంకాదని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటే మినహా పోలీసుశాఖకు ఆధార్ లింకేజీ ఇవ్వడం కుదరదని స్పష్టంచేశారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొరికిన ఓ తల లేని మొండెం కేసును ఛేదించేందుకు పోలీసుశాఖ.. ఆధార్ అధికారులను సంప్రదించింది. ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వేలిముద్రలను మృతదేహం వేలిముద్రలతో సరిపోల్చినట్లయితే మృతుడు ఎవరనేదీ గుర్తించడం సాధ్యమవుతుందని పేర్కొంది. అయితే ఆధార్ అధికారులు అందుకు కూడా ససేమిరా అన్నట్లు సమాచారం. నిందితులను గుర్తించేందుకు వీలుగా ఆధార్‌తో లింకేజీ ఇవ్వాలని బెంగళూరులో జరిగిన ఆలిండియా ఫింగర్‌ప్రింట్ బ్యూరో డెరైక్టర్ల సమావేశం సందర్భంగా ఆధార్ ఉన్నతాధికారులకు ఓ ప్రతిపాదన అందజేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీచేస్తేనే పోలీసుశాఖకు ఆధార్ లింకేజీ ఇస్తామని ఉన్నతాధికారులు అప్పుడే స్పష్టంచేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) గతంలో రాసిన లేఖకు కూడా ఆధార్ అధికారుల నుంచి నో అనే సమాధానమే వచ్చింది. వివిధ నేరాలకు సంబంధించి నిందితులను గుర్తించేందుకు నేర స్థలంలో దొరికిన వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ బ్యూరో డేటాబేస్ సెంటర్‌లోని వేలిముద్రలతో సరిపోల్చుతారు. ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో ప్రస్తుతం 4.80 లక్షల వేలిముద్రలున్నాయి. అయితే, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నిందితులెవరో గుర్తించలేని 35 వేల వేలిముద్రలున్నాయి. ఆధార్ కార్డుతో లింకు చేయడం ద్వారా ఆ 35 వేల వేలిముద్రల గుట్టు కూడా రట్టయ్యే అవకాశం ఉందని పోలీసుశాఖ భావిస్తోంది.