వర్షపు నీటిని ఒడిసి పడదాం | Insect potholes For Saving Rain Water in Hyderabad | Sakshi
Sakshi News home page

వర్షపు నీటిని ఒడిసి పడదాం

Published Wed, May 15 2019 8:41 AM | Last Updated on Wed, May 15 2019 8:41 AM

Insect potholes For Saving Rain Water in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వర్షపు నీటిని నేలగర్భంలోకి ఇంకించే ఇంకుడు గుంతలను నిర్లక్ష్యంచేస్తూ.. వాటి నిర్వహణ మరచిన సంస్థలకు జలమండలి తాజాగా నోటీసులు జారీచేస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పటికే ఇంకుడు గుంతలు ఉన్నచోట వాటిని బాగుచేసి...నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు నగరవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కాలనీసంక్షేమ సంఘాలు, పార్కులు, వాణిజ్య, నివాస భవనాల్లో ఇంకుడు గుంతల సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, వర్క్‌ఇన్స్‌పెక్టర్లు విధిగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నెల 18న అన్ని వర్గాల వారు ఇంకుడు గుంతల సామర్థ్యం పెంపొందించే దిశగా వాటికి తక్షణం నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని, వాటిపై ఉన్న సిల్ట్‌ ఇతర ఘన వ్యర్థాలను తొలగించాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఇంకుడు గుంతలు లేని వారు సైతం తక్షణం వాటిని ఏర్పాటుచేసుకోవాలని..లేనిపక్షంలో సదరు భవనాలకు నీటిసరఫరాను తగ్గిస్తామని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు.

భూగర్భ జలవిల...
గ్రేటర్‌లో భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటుమహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈనేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం.

నీతి ఆయోగ్‌ హెచ్చరికలు....
బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్‌ పిట్స్‌ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది.

గ్రేటర్‌లో భూగర్భ జలవిల ఇలా...
సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్‌ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌ పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు, కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. 

ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి...
సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్‌),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.

వర్షపునీటిలో 60 శాతం వృథా
వరుణుడు కరుణించినా..వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక  గ్రేటర్‌ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జి పిట్స్‌ తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రేటర్‌లో 60 శాతం మేర వర్షపునీరు వృథాగా పోతుండడంతోనే ఈపరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథా అవడం సిటీజనుల పాలిట శాపంగా మారుతోంది.  

ఇంకుడు గుంతలతో ఎన్నో ఉపయోగాలు
సాధారణ వర్షపాతం (20 మిల్లీ మీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని ఇంకుడు గుంత ద్వారా నేలగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడురోజుల అవసరాలకు సరిపోతాయి. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జల బ్యాంక్‌ ఏర్పాటుచేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు..మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం..జీవం అందజేసిన వారవుతారు.      – ఎం.దానకిశోర్,    బల్దియా కమిషనర్, జలమండలి ఎండీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement