సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు రోడ్ల కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గుంతలతోకూడిన అధ్వానపు రోడ్లతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వారంలో కురిసిన ఒకటి రెండు చిరుజల్లులకే అనేక ప్రాంతాల్లో నీటినిల్వలు పేరుకుపోయి ప్రయాణం నరకప్రాయంగా మారింది. అక్కడ.. ఇక్కడ అన్న తేడా లేకుండా నగరంలోని అన్ని సర్కిళ్లలోనూ ఇదే దుస్థితి. రోడ్ల సమస్యలపై ప్రజలు ఎంతగా మొత్తుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేవు. వర్షాలొచ్చి రోడ్లు నీటమునిగి చెరువులుగా మారినప్పుడు హడావుడి ప్రకటనలు చేసే జీహెచ్‌ఎంసీ యంత్రాంగం..ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రోడ్లు పూర్తిగా దెబ్బతినకముందే తగిన మరమ్మతులు, రీకార్పెటింగ్ చేసేందుకు పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట ప్రభుత్వం గత జనవరి 31వ తేదీన రూ.721.86 కోట్లు మంజూరు చేస్తూ జీవో (నెంబర్ 88) జారీ చేసింది.
టెండర్లు తదితరమైనవి పూర్తయి ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. ఆర్నెళ్లలో అంటే సెప్టెంబర్ నెలాఖరుకు పనులు పూర్తి కావాల్సి ఉండగా పూర్తికాలేదు. వాస్తవానికి జూలై– సెప్టెంబర్‌ల మధ్య వర్షాల వల్ల ఇబ్బందులుంటాయి. కానీ ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు కూడారాలేదు. పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. అయినప్పటికీ, ఇప్పటి వరకు దాదాపు 60 శాతం పనులే జరిగాయి. పనులు జరిగిన ప్రాంతాల్లోనూ అప్పుడే దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన ఒకటీ అరా చిరుజల్లులకే అనేక ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దాని వల్ల తాము తీవ్ర సమస్యలు పడుతున్నామంటూ పలువురు ప్రజలు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మరమ్మతుల కోసం రోడ్లు తవ్వి.. పూర్తిచేయకుండా వదిలేశారు. ’మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌తోపాటు వెబ్‌సైట్, కాల్‌సెంటర్, డయల్ 100లతో పాటు ట్విట్టర్ ద్వారానూ ఫిర్యాదులు చేశారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రోడ్లు దెబ్బతిన్నాయని దాదాపు మూడువేల ఫిర్యాదులందాయంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.
ఫిర్యాదులిలా..
వేటి ద్వారా ఎన్ని
మై జీహెచ్‌ఎంసీ 2014
కాల్‌సెంటర్ 480
వెబ్‌సైట్ 160
ట్విట్టర్ 105
వీటితోపాటు సంబంధిత అధికారులకు స్వీయదరఖాస్తుల ద్వారానూ ప్రజావాణి తది తర వేదికల ద్వారానూ ఫిర్యాదులందజేశారు.
మందకొడిగా..
పీపీఎం పనుల్లో భాగంగా దాదాపు 120 పనులకు కాంట్రాక్టులు పిలిచారు. వీటిల్లో బీటీ, సీసీ రోడ్లున్నాయి. మొత్తం పనుల్లో దాదాపు రూ. 32 కోట్ల విలువైన పది బీటీ రోడ్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా వాటిల్లో కొన్ని పురోగతిలో ఉన్నాయి. కొన్ని అసలు ప్రారంభమే కాలేదు. ఇప్పటి వరకు దాదాపు రూ. 200 కోట్ల మేర పనులు జరగ్గా, నిధులు అందక కొన్ని పనుల వేగం మందగించగా, కొన్ని పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ పనులకవసరమయ్యే నిధులు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్‌డీసీఎల్) ద్వారా జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. అయితే అక్కడి నుంచి నిధులు రాకపోవడంతో జీహెచ్‌ఎంసీ చేతులెత్తేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ. 65 కోట్లు మాత్రమే అందాయి.
పనుల పురోగతి ఇలా..బీటీ రోడ్లు..
మొత్తం పనులు :52
అంచనా వ్యయం : రూ. 254 కోట్లు
పూర్తయిన పనులు : 10– వీటి విలువ
రూ.33 కోట్లు
పురోగతిలోని పనులు: 40– వీటి విలువ రూ.200 కోట్లు
సీసీ రోడ్లు..
మొత్తం పనులు :56
అంచనా వ్యయం : రూ. 227 కోట్లు
పురోగతిలోని పనులు: 50– వీటి విలువ రూ.195 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment