రంగంలోకి ఎన్‌ఐఏ, ఏటీఎస్ | Inspector general field, ATS | Sakshi
Sakshi News home page

రంగంలోకి ఎన్‌ఐఏ, ఏటీఎస్

Published Mon, Apr 6 2015 2:21 AM | Last Updated on Mon, Oct 8 2018 3:36 PM

Inspector general field, ATS

  • ఎన్‌కౌంటర్ స్థలికి వెళ్లి ఆధారాల సేకరణ
  •  దుండగుల మృతదేహాలను పరిశీలించిన ఏటీఎస్
  •  ఘటనాస్థలికి కర్ణాటక, మధ్యప్రదేశ్ పోలీసులు
  •  విచారణ చేపట్టిన రాష్ర్ట ఇంటెలిజెన్స్ విభాగం
  •  అర్వపల్లి గుట్టల్లో పోలీసుల కూంబింగ్
  • సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారెవరో నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ముంబై నుంచి యాంటీ టైస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) బృందాలు ఆదివారం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకున్నాయి.

    ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను, కొందరు జానకీపురం గ్రామస్థులను విచారించాయి. మధ్యాహ్నం 1:30 సమయంలో ముంబైకి చెందిన ఏటీఎస్ టీం జానకీపురం వెళ్లింది. వారి వెంట జిల్లాకు చెందిన ఓ సీఐ, ఎస్‌ఐతోపాటు ఆపరేషన్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఘటన ఎలా జరిగింది, దుండగులు ఎంతదూరం నుంచి కాల్పులు జరిపారు.. తదితర వివరాలను సేకరించినట్టు తెలిసింది. సాయంత్రం సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన ఎన్‌ఐఏ బృందం కూడా తమ దర్యాప్తునకు అవసరమైన వివరాలను సేకరించింది.

    మరోవైపు మధ్యప్రదేశ్, కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు కూడా ఘటనాస్థలానికి వచ్చి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి పరారైన దుండగులు వీరేనన్న సమాచారంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఇక కర్ణాటకలో విధ్వంసం చేయడానికి ప్రణాళికలు రూపొందించిన ముఠా సభ్యు లు వీరేనన్న కోణంలో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మన రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

    అసలేం జరిగింది, వారి ప్రణాళికలేంటన్న దానిపై ఈ బృందం దృష్టిసారించింది. కాగా, దుండగుల మృతదేహాలను ఉంచిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి వద్దకు కూడా ఏటీఎస్ బృందాలు వెళ్లాయి. అధికారులు అత్యంత గోప్యంగా ఆసుపత్రికి వెళ్లి తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. దుండగుల వేలిముద్రలను తీసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ర్ట శాంతిభద్రతల అదనపు డీజీ సుధీర్ లక్టాకియా, ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకరరావు కూడా మృతదేహాలను పరిశీలించి వెళ్లినట్టు తెలుస్తోంది.  
     
    విస్తృతంగా కూంబింగ్..

    దుండగుల ముఠాలో ఇంకెవరైనా ఉన్నారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఆక్టోపస్ పోలీసులతో కలిసి దాదాపు 150 మంది వరకు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా నిందితులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి గుట్టల్లో పెద్ద ఎత్తున గాలింపులు జరిపారు. కాగా, ఆదివారం ఉదయం జిల్లాలో మరోసారి వదంతులు వ్యాపించాయి. తుంగతుర్తి మండలంలోని కుక్కడం గ్రామంలో మరో దుండగుడు స్థానికులకు తారసపడ్డాడని పుకార్లు రావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, నాగారం, అర్వపల్లి గుట్టల్లో కూంబింగ్ నిర్వహించిన తర్వాత అలాంటిదేమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement