సాక్షి, హైదరాబాద్: రామగుండం బి.థర్మల్ విద్యుత్ కేంద్రానికి గండం తప్పింది. ఆరు దశాబ్దాల నాటి ఈ పాత ప్రాజెక్టు మరమ్మతుకు కావాల్సిన విడిభాగాలు ఎట్టకేలకు లభించాయి. త్వరలో అధికారులు విద్యుత్ ప్లాంట్‌ను పునరుద్ధరించనున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన స్టీమ్ టర్బైన్ పరికరం విరిగిపోవడం, ఇతర సాంకేతిక లోపాలు తలెత్తడంతో గతేడాది సెప్టెంబర్ 14 నుంచి రామగుండం ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది.
రూ.40 కోట్లు వెచ్చించి ప్లాంట్ పునరుద్ధరణ చేసినా ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ఆందోళన నెలకొంది. ఎలాగైనా ఈ విడిభాగాలను సాధించేందుకు తెలంగాణ జెన్‌కో గత కొన్ని నెల లుగా నిర్వహించిన అన్వేషణ ఫలిం చింది. ఒరిస్సాలోని తాల్చేర్‌తోపాటు మహారాష్ట్రలోని అకోల జిల్లా పరాస్‌లో ఇప్పటికే మూతబడిన పాత థర్మల్ ప్లాంట్ విడిభాగాలను పరిశీలించారు.
మహారాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(మహాజెన్‌కో) 1967లో 62.5 మెగావాట్ల సామర్థ్యంతో పరాస్‌లో నిర్మితమైన ప్లాంట్‌లో రామగుండం ప్లాంట్‌కు సరి పడే స్టీమ్‌టర్బైన్స్, ఇతర పరికరాలున్నట్లు గుర్తిం చారు. మహాజెన్‌కోతో చర్చలు జరిపి పాత పరికరాలను కొనుగోలు చేశారు. మరమ్మతులను పూర్తి చేసి సోమవారం నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్లాంట్ మరో దశాబ్దం పాటు విద్యుత్ ఉత్పత్తికి దోహదపడనుంది.