- ‘తూర్పు’ నేతల భూ దందాలపై ప్రభుత్వానికి నివేదికలు..
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు
- అప్పుడే ప్రజాప్రతినిధులకు అపవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజకీయ అవినీతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించడం అవినీతికి తెరలేపిన అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకింత వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ విషయంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై బర్తరఫ్ వేటు పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజాప్రతినిధుల ‘వ్యవహారాల’పై కూడా ఇంటెలిజెన్స్ విభాగం దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు పంపుతోందని వస్తున్న వార్తలు సదరు నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
పదవులు పొందిన ఆరు నెలల్లోనే కొందరు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తూర్పు జిల్లాలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఏకంగా రియల్టర్లతో చేతులు కలిపి భూ దందాకు తెరలేపారనే విమర్శలున్నాయి. మంచిర్యాల మండలం నస్పూర్, వేంపల్లి, మంచిర్యాల, సీతారాంపల్లితోపాటు, పరిసర గ్రామ పంచాయతీల పరిధిలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ (సీలింగ్, అసైన్డ్) భూములు బినామీ పేర్లతో కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు ఈ నేతల చెప్పుచేతుల్లో ఉండటంతో రియల్టర్లు కూడా ఆ ప్రజాప్రతినిధులను తమ వ్యాపారాల్లో వాటాదారులుగా చేసుకున్నారు.
జిల్లాలో పలు మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో వాటాల వ్యవహారం కూడా నెల రోజుల క్రితం రచ్చకెక్కింది. రూ.కోట్లు విలువ చేసే ఇసుకను కొల్లగొట్టిన ఇసుకాసురుని వద్ద పెద్ద మొత్తంలోనే పిండుకుని సదరు అక్రమార్కునికి స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కండువా కప్పడం స్థానికంగా ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తులకు దారితీసింది. స్వతహాగా రియల్టర్ అయిన ఓ ప్రజాప్రతినిధి ఇప్పటికీ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆ నియోజకవర్గంలో ఏ అక్రమ వెంచర్ వెలిసినా ఈ నేతకు వాటా ఇవ్వాల్సిందేననే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాణహిత-చేవెళ్ల పనులను ఇటీవల అడ్డుకోవడంతో ఆ కాంట్రాక్టర్ పార్టీ పెద్దలకు మొర పెట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ స్థానికంగా సాగుతోంది. నేతల ఈ భూ దందాపై ఇంటెలిజెన్స్ విభాగం నుంచి నివేదికలు వెళ్లినట్లు సమచారం.
కేంద్రం నుంచి రూ.కోట్లలో నిధులు వచ్చే కీలక శాఖల బాధ్యతలను అప్పగించడం.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు కట్టబెట్టేలా ఒత్తిళ్లు తేవడం కూడా అప్పట్లో ఆ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా’ తయారైంది.. రాజకీయ కేంద్రమైన నిర్మల్ నేతల అవినీతి బాగోతం. కీలక ప్రజాప్రతినిధి అనుచరుడిగా ముద్ర వేసుకుని పలు శాఖ డిప్యూటీ ఇంజినీర్లను, ఏఈలను అక్రమంగా బదిలీలు చేయించి రూ.లక్షలు దండుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కూడా గడవక ముందే ఓ నేత అక్రమ ‘పనుల’కు తెరలేపారు. సంబంధిత శాఖలు అంచనాలు రూపొందించకుండానే.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకుండానే.. టెండర్లు పిలవకుండానే జిల్లా కేంద్రంలో తన నివాస ప్రాంతంలో రహదారి నిర్మించుకున్నారు.
ఈ అక్రమ రోడ్డును సక్రమం చేసేందుకు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండటం వంటి వ్యవహారాలపై నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. ద్వితీయశ్రేణి ప్రజాప్రతినిధులు కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు. ముఖ్య నేతలకు దీటుగా మున్సిపాలిటీల్లో, మేజర్ గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సర్కారు, చెరువు భూముల ఆక్రమణల్లో ఆరితేరిన ఈ నేతల వ్యవహారాలపై నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తుండటం ఇప్పుడు వారిని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.