సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళంపై న్యాయ విచారణకు ఆదేశించాలనే డిమాండ్‌తోపాటు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని భరోసా కల్పించేందుకు కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీల ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ నిర్వ హించారు. దీనిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్, ఇందిరాపార్కు, కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్‌కు వచ్చే వారి నుంచి ఈ పార్టీల నేతలు సంతకాలు సేకరించారు. అఖిలపక్షం పిలుపు మేరకు విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఓయూ ఎన్‌సీసీ చౌరస్తా దగ్గర మార్నింగ్ వాకర్స్‌తో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భం గా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతకం చేసి మద్దతు తెలిపారు. విద్యార్థులు ఎవరు కూడా చనిపోవద్దని.. బతికుండి సాధించాలని.. ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు తాము పోరాడుతామని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో నేర్చుకోవాల్సింది.. సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ‘మార్కులతోనే జీవితం అంతం కాదు. జీవితంలో ప్రతి ఒక్క రూ ఏదో స్థాయిలో ఫెయిలైన వారే.. ఫెయిల్ కాకుం డా విజయానికి తోవ దొరకదు..’అని చెప్పారు.
మేమంతా మీవెంటే..
సంతకం చేసి సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి పక్షాన నిలిచి పోరాడేందుకు తామంతా ఉన్నామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్ బోర్డు కారదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ సందర్భంగా ‘వైఫల్యం విజయానికి తొలిమెట్టు.. జీవితానికి అది ముగింపు కాదు.. చావు సమస్యకు పరిష్కారం చూపదు బతికుండి సాధిద్దాం.. మేమంతా మీవెంటే ఉన్నాం’ అని విద్యార్థులకు మద్దతు పలుకుతూ పలువురు సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment