inquest
-
విద్యార్థులారా ఆత్మహత్యలొద్దు..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళంపై న్యాయ విచారణకు ఆదేశించాలనే డిమాండ్‌తోపాటు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని భరోసా కల్పించేందుకు కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీల ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ నిర్వ హించారు. దీనిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్, ఇందిరాపార్కు, కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్కు వచ్చే వారి నుంచి ఈ పార్టీల నేతలు సంతకాలు సేకరించారు. అఖిలపక్షం పిలుపు మేరకు విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఓయూ ఎన్సీసీ చౌరస్తా దగ్గర మార్నింగ్ వాకర్స్‌తో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతకం చేసి మద్దతు తెలిపారు. విద్యార్థులు ఎవరు కూడా చనిపోవద్దని.. బతికుండి సాధించాలని.. ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు తాము పోరాడుతామని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో నేర్చుకోవాల్సింది.. సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ‘మార్కులతోనే జీవితం అంతం కాదు. జీవితంలో ప్రతి ఒక్క రూ ఏదో స్థాయిలో ఫెయిలైన వారే.. ఫెయిల్ కాకుం డా విజయానికి తోవ దొరకదు..’అని చెప్పారు. మేమంతా మీవెంటే.. సంతకం చేసి సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి పక్షాన నిలిచి పోరాడేందుకు తామంతా ఉన్నామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్ బోర్డు కారదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ సందర్భంగా ‘వైఫల్యం విజయానికి తొలిమెట్టు.. జీవితానికి అది ముగింపు కాదు.. చావు సమస్యకు పరిష్కారం చూపదు బతికుండి సాధిద్దాం.. మేమంతా మీవెంటే ఉన్నాం’ అని విద్యార్థులకు మద్దతు పలుకుతూ పలువురు సంతకాలు చేశారు. -
నయీం అక్రమాలపై విచారణ జరపాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నయీం గ్యాంగ్ చేసిన హత్యలు, ఆస్తుల ఆక్రమణలపై హైకోర్టు ఆధ్వర్యంలో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కబ్జాలతో ఆస్తులు, భూములు కోల్పోయిన వారికి విచారణ ద్వారా న్యాయం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో చాడ విలేకరులతో మాట్లాడారు. నయీం డైరీలో నేరాల చిట్టా మొత్తం ఉందని చెబుతున్నా, ఇంత వరకు డైరీని ఎందుకు బహిరంగ పర్చలేదని ప్రశ్నించారు. ఇటీవల అకాల వర్షాలు, పిడుగు లు, కరువుతో రైతులపై ముప్పేట దాడి జరుగు తున్నందున, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మానవ తప్పిదం వల్లే కేరళ విపత్తు!
తిరువనంతపురం: జలవిలయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళలో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావస్తుంటే మరోవైపు వరద రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కేరళ వరదలు మానవ తప్పిదం వల్ల చోటుచేసుకున్న విపత్తేనని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకేసారి 40 ఆనకట్టల గేట్లు ఎత్తడమే ఈ కల్లోలానికి కారణమని రాష్ట్రంలోని లెఫ్ట్ సర్కారుపై రాష్ట్ర ప్రతిపక్షంతో పాటు బీజేపీ ఆరోపించాయి. విపత్తుపై న్యాయ విచారణకు డిమాండ్ ఈ మహాప్రళయానికి దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించాలని మంగళవారం కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. ‘పంబ నదీ పరీవాహకంలోని 9 డ్యాంలు, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో పెరియార్‌పై 11, త్రిస్సూర్‌లోని చాలకుడి నదీ పరీవాహకంలో ఆరు డ్యాంల నుంచి నీటిని ఒక్కసారి విడుదల చేస్తే ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయో అనేదానిపై ప్రభుత్వానికి అవగాహన శూన్యం. సరైన హెచ్చరికలు చేయకుండా ఒకేసారి 44 డ్యాంల ఆనకట్టల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.’ అని ఆయన అన్నారు. ఈ విపత్తుకు విజయన్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు చేశాకే నీటి విడుదల ‘మా నియంత్రణలో ఉన్న డ్యాంల విషయంలో తప్పిదం జరగలేదు. హెచ్చరికలు జారీచేశాకే నీటిని విడుదల చేశాం. నదులు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగాయి. డ్యాంల గేట్లు ఎత్తివేయడం వల్లే వరదలు సంభవించాయి అనడంలో అర్థంలేదు’ అని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు(కేఎస్ఈబీ) చైర్మన్ కేపీ శ్రీధరన్ వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు అర్థరహితమని డ్యాంల భద్రతా విభాగం చైర్మన్ రామచంద్రన్ చెప్పారు. ఈ వరద కేవలం అధిక వర్షపాతం వల్లే చోటుచేసుకోలేదని, నిర్లక్ష్యం తోడైందని విపత్తు పరిశోధన ప్రత్యేక విభాగం చైర్పర్సన్, ఢిల్లీ జేఎన్‌యూ వర్సిటీ ప్రొఫెసర్ అమృతా సింగ్ అన్నారు. శరవేగంగా పునర్నిర్మాణ పనులు: కేరళలో పునర్నిర్మాణం, పారిశుధ్య పనులు ఊపందు కున్నాయి. బురద, చెత్తతో నిండిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయడంతో ప్రజలు నిమగ్నమయ్యారు. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు ఇంట్లో నిండిన బురద, భారీ చెత్తను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. ‘మేం మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఏమీ మిగల్లేదు’ అని ఓ మహిళ చెప్పింది. బావులన్నీ మురికినీటితో కలుషితం కావడం వల్ల ప్రజలు తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. సులువుగా బీమా పరిహారం కేరళ వరద బాధితుల బీమా క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించేందుకు ఎల్ఐసీ నిబంధనలను సరళీకరించింది. పాలసీదారుడి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అతడి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయబోమని బుధవారం ప్రకటించింది. అధీకృత ప్రభుత్వ అధికారి ఇచ్చే ఏదైనా పత్రం లేదా ప్రభుత్వం నుంచి పరిహారం పొందినట్లు ఆధారాలు ఇస్తే చాలు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా(పీఎంజేజేబీవై) పథకంలో చేరిన పాలసీదారుల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు భాగస్వామ్య బ్యాంకులతో కలసిపనిచేస్తున్నామని తెలిపింది. కేరళకు సిద్ది వినాయక్ రూ.కోటి సాయం సాక్షి, ముంబై: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి సాయం ఇవ్వనున్నట్లు ప్రభాదేవిలోని సిద్ది వినాయక్ ఆలయ ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఈ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. పతంజలి నుంచి రూ.2 కోట్ల సాయం: బాబా రాందేవ్ వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ, కర్ణాటకలను ఆదుకునేందుకు పతంజలి సంస్థ తమ వంతు కృషిచేస్తోంది. ‘టూత్‌పేస్టులు మొదలుకొని మంచి నీటి బాటిళ్ల వరకు ఇలా దాదాపు రూ.50 లక్షల విలువైన సరకులను ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపించాం. మరో వారంలో అదనంగా దాదాపు రూ.1.5కోట్ల విలువైన సహాయక సామగ్రిని వరద బాధిత రాష్ట్రాలకు తరలిస్తాం’ అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. ఇంకా వరద ముంపులోనే పలు ప్రాంతాలు ఆగస్టు 8 నుంచి వరదల్లో 231 మంది మరణించగా.. ఇంకా 32 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయక శిబిరాల్లో 14.5 లక్షల మంది తలదాచుకున్నారు. కుట్టనంద్, అలపుజా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. కేరళకు కేంద్రం రూ. 600 కోట్ల సాయాన్ని విడుదల చేయగా.. మరోవైపు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఇంతవరకూ రూ. 309 కోట్ల విరాళాలు అందాయి. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని గోప్యంగా ఉంచడం, మీడియాను అనుమతించకపోవడం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాల నిరంకుశ, నియంత్రత్వ విధానాలకు నిదర్శనమన్నారు. నెత్తుటి మరక ఉండని తెలంగాణ అంటే ఇలాంటి పాలనేనా అని ప్రశ్నించారు. సుప్రీం జడ్జితో విచారణ చేయించాలి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ చంద్రన్న డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
చెరిల్ జేమ్స్ మరణంపై మరోసారి విచారణ!
బ్రిటిష్ ఆర్మీకి చెందిన డీప్ కట్ సైన్య శిబిరాల్లో లైంగిక వేధింపుల సంస్కృతి కొనసాగుతున్నట్లు గతంలో ఎన్నో ఆధారాలు కనిపించినా పట్టించుకున్నవారే లేరు. అయితే సైన్యంలో శిక్షణ పొందుతూ 'చెరిల్ జేమ్స్' మరణించడం వెనుక దారుణ చరిత్ర ఉందని తాజా విచారణలో బయట పడుతోంది. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో అప్పట్లో కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా చెరిల్ జేమ్స్ మరణంపై న్యాయ విచారణ చేపట్టాలని ఆమె కుటుంబం తరపున మానవ హక్కుల సంఘం ముందుకు రావడంతో తిరిగి విచారణ ప్రారంభమైంది. 1995 లో డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతున్న చెరిల్ జేమ్స్ బుల్లెట్ గాయాలతో మరణించింది. అయితే అప్పటినుంచీ విచారణ చేపట్టిన కోర్టు... 2014 లో తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది. తాజాగా 18 ఏళ్ళ.. సోల్జర్ పీటర్ జేమ్స్ కేసులో ఆమె కుటుంబం తరపున లిబర్టీ మావన హక్కుల సంఘం... కోర్టు ముందు తన వాదనను వినిపించింది. బ్రియాన్ బార్కర్ క్యూసీ అధ్యక్షతన ప్రారంభమైన న్యాయ విచారణకు ముందు.. పీటర్ జేమ్స్ తండ్రి.. దేశ్... తన కుమార్తెతోపాటు, డీప్ కట్ లో వేధింపులతో మరణించిన యువసైనికులందరికీ న్యాయం జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు. డీప్ కట్ క్యాంపులో అదుపులేని మద్యం, డ్రగ్ సంస్కృతి కూడా కొనసాగుతున్నట్లు తమకు తెలిసిందని దేశ్ వెల్లడించారు. శిబిరంలో కొనసాగుతున్న ఇటువంటి దారుణ సంస్కృతే నలుగురు యువ సైనికుల మరణానికి కారణమైందన్నారు. ఐస్ బర్గ్ కు చివరి భాగంలో ఉండే డీప్ కట్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు ఇప్పటికైనా ప్రపంచానికి తెలియాలని, ఆ నలుగురు యువ సైనికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా డీప్ కట్ శిబిరంలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తమ కూతుర్ని కోల్పోయిన నేటి తరుణంలోనైనా అక్కడి దారుణ చరిత్ర బహిర్గతం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. 1995-2002 మధ్య చెరిల్ జేమ్స్ తో పాటు... బెంటన్ జేమ్స్, కొలిన్, జియోఫ్ గ్రే కూడా డీప్ కట్ లో తుపాకీ గాయాలతోనే మరణించారు. కుడికన్నుకు, ముక్కుకు మధ్య భాగంలో తగిలిన బుల్లెట్ గాయంతో 1995 లో పీటర్ జేమ్స్ మరణించింది. ఆ సమయంలో ఆమె... బ్రిటన్ సౌత్ వేల్స్ లంగోలెన్ లోని డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతోంది. 1995- 2002 కు మధ్య డీప్ కట్ లో బుల్లెట్ గాయాలతో మరణించిన యువ సైన్యం నలుగురిలో జేమ్స్ ఒకరు. అక్కడి వేధింపుల సంస్కృతి నేపథ్యంలోనే వారంతా మరణించినట్లు అంతా అనుకున్నా.. కోర్టుకు తగిన సాక్ష్యాలు మాత్రం అందించలేక పోయారు. అయితే మొదటి దర్యాప్తులో జరిగిన న్యాయ విచారణకు విరుద్ధంగా తాజా విచారణలో కనీసం 100 మంది సాక్షుల ఆధారాలను అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గంటపాటు జరిగిన విచారణలో ఏడుగురు సాక్షులను ప్రవేశ పెట్టి వారి సాక్ష్యాలను రికార్డు చేశారు. పీటర్ జేమ్స్ తన మరణానికి కొద్ది సమయం ముందు సీనియర్ల లైంగిక దాడికి గురైందన్న ఆరోపణ నేపథ్యంలో ఈ తాజా విచారణ ప్రారంభమైంది. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి
మావోయిస్టు ఉద్యమ నేత కవితకు వరవరరావు నివాళి హైదరాబాద్: మద్దెగూడలో జరిగిన భూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. జూలై 31న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా మద్దెగూడలో జరిగిన ఎన్కౌంటర్లో కవితతో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పొడియా బ్లాక్ డిప్యూటి కమెండర్‌గా వ్యవహరిస్తున్న కవిత.. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి డివిజన్లోని నాగమయ్యకుంటవాసి బండి రాములు, సుమిత్ర దంపతుల కుమార్తె. అయితే పోలీసులే కవితను చిత్ర హింసలకు గురి చేసి చంపార ని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం మృతి చెందిన కవిత మృతదేహాన్ని పోలీసులు ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరవరరావు గురువారం కవిత భౌతికకాయానికి నివాళుల్పరించి మీడియాతో మాట్లాడారు. ఉద్యమనేత కవితకు గురువారం నాగమయ్యకుంటలో పలువురు మావోయిస్టు సానుభూతిపరులు నివాళులు అర్పించారు. వీరిలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంజమ్మ, పద్మకుమారి, నర్సన్న, సీఎల్సీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణ రావు, చైతన్య మహిళ సంఘం నాయకులు దేవేంద్ర, శిల్ప, సీఆర్పీపీ నాయకులు బల్లా రవీంధ్ర, దశరథ, డప్పు రమేష్ తదితరులు ఉన్నారు. అంబర్‌పేట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
న్యాయ విచారణకు పట్టు
కూడగి ఘటనపై విపక్షాల ఆందోళన మెజిస్టీరియల్ విచారణతో న్యాయం జరగదని సూచన బీజేపీ సభ్యుల వాకౌట్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లా కూడగిలో థర్మల్ విద్యుత్కేంద్రం ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసు కాల్పులు జరిగిన సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ చేపట్టాలని సోమవారం శాసన సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ రైతులపై లాఠీ ఛార్జి, కాల్పులు జరపడం అసమంజసమని విమర్శించారు. రైతులను శాంతింపజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేస్తూ, జిల్లాధికారి పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుందని తెలిపారు. అయితే స్థానికులు జిల్లా యంత్రాంగపైనే ఆగ్రహం వ్యక్తం చేసినందున వారికి న్యాయం జరగదన్నారు. కనుక న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానికులకు ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పడానికి ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉద్యోగాలివ్వలేదని బీజేపీ సభ్యుడు గోవింద కారజోళ ఆరోపించారు. నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తామనే మాటనూ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని జేడీఎస్ పక్షం నాయకుడు కుమార స్వామి అన్నారు. హోం మంత్రి కేజే. జార్జ్ చర్చకు సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల వ్యయంతో ఈ విద్యుత్కేంద్రాన్ని చేపట్టిందని తెలిపారు. అనేక విదేశ కంపెనీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయని వెల్లడించారు. విద్యుత్కేంద్రం నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో, దీనిని వ్యతిరేకిస్తే విదేశ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావని ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి చికిత్సలు చేయిస్తున్నామని, రైతులకు సాంత్వన కలిగించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని వివరించారు. గాయపడిన ఇద్దరు రైతులకు రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం ప్రకటించామని తెలిపారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.