
తిరువనంతపురం: జలవిలయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళలో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావస్తుంటే మరోవైపు వరద రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కేరళ వరదలు మానవ తప్పిదం వల్ల చోటుచేసుకున్న విపత్తేనని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకేసారి 40 ఆనకట్టల గేట్లు ఎత్తడమే ఈ కల్లోలానికి కారణమని రాష్ట్రంలోని లెఫ్ట్ సర్కారుపై రాష్ట్ర ప్రతిపక్షంతో పాటు బీజేపీ ఆరోపించాయి.
విపత్తుపై న్యాయ విచారణకు డిమాండ్
ఈ మహాప్రళయానికి దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించాలని మంగళవారం కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. ‘పంబ నదీ పరీవాహకంలోని 9 డ్యాంలు, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో పెరియార్‌పై 11, త్రిస్సూర్‌లోని చాలకుడి నదీ పరీవాహకంలో ఆరు డ్యాంల నుంచి నీటిని ఒక్కసారి విడుదల చేస్తే ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయో అనేదానిపై ప్రభుత్వానికి అవగాహన శూన్యం. సరైన హెచ్చరికలు చేయకుండా ఒకేసారి 44 డ్యాంల ఆనకట్టల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.’ అని ఆయన అన్నారు. ఈ విపత్తుకు విజయన్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై తప్పుపట్టారు.
ముందస్తు హెచ్చరికలు చేశాకే నీటి విడుదల
‘మా నియంత్రణలో ఉన్న డ్యాంల విషయంలో తప్పిదం జరగలేదు. హెచ్చరికలు జారీచేశాకే నీటిని విడుదల చేశాం. నదులు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగాయి. డ్యాంల గేట్లు ఎత్తివేయడం వల్లే వరదలు సంభవించాయి అనడంలో అర్థంలేదు’ అని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు(కేఎస్‌ఈబీ) చైర్మన్ కేపీ శ్రీధరన్ వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు అర్థరహితమని డ్యాంల భద్రతా విభాగం చైర్మన్ రామచంద్రన్ చెప్పారు. ఈ వరద కేవలం అధిక వర్షపాతం వల్లే చోటుచేసుకోలేదని, నిర్లక్ష్యం తోడైందని విపత్తు పరిశోధన ప్రత్యేక విభాగం చైర్‌పర్సన్, ఢిల్లీ జేఎన్‌యూ వర్సిటీ ప్రొఫెసర్ అమృతా సింగ్ అన్నారు.
శరవేగంగా పునర్నిర్మాణ పనులు: కేరళలో పునర్నిర్మాణం, పారిశుధ్య పనులు ఊపందు కున్నాయి. బురద, చెత్తతో నిండిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయడంతో ప్రజలు నిమగ్నమయ్యారు. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు ఇంట్లో నిండిన బురద, భారీ చెత్తను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. ‘మేం మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఏమీ మిగల్లేదు’ అని ఓ మహిళ చెప్పింది. బావులన్నీ మురికినీటితో కలుషితం కావడం వల్ల ప్రజలు తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు.
సులువుగా బీమా పరిహారం
కేరళ వరద బాధితుల బీమా క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించేందుకు ఎల్‌ఐసీ నిబంధనలను సరళీకరించింది. పాలసీదారుడి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అతడి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయబోమని బుధవారం ప్రకటించింది. అధీకృత ప్రభుత్వ అధికారి ఇచ్చే ఏదైనా పత్రం లేదా ప్రభుత్వం నుంచి పరిహారం పొందినట్లు ఆధారాలు ఇస్తే చాలు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా(పీఎంజేజేబీవై) పథకంలో చేరిన పాలసీదారుల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు భాగస్వామ్య బ్యాంకులతో కలసిపనిచేస్తున్నామని తెలిపింది.
కేరళకు సిద్ది వినాయక్ రూ.కోటి సాయం
సాక్షి, ముంబై: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి సాయం ఇవ్వనున్నట్లు ప్రభాదేవిలోని సిద్ది వినాయక్ ఆలయ ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఈ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు.
పతంజలి నుంచి రూ.2 కోట్ల సాయం: బాబా రాందేవ్
వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ, కర్ణాటకలను ఆదుకునేందుకు పతంజలి సంస్థ తమ వంతు కృషిచేస్తోంది. ‘టూత్‌పేస్టులు మొదలుకొని మంచి నీటి బాటిళ్ల వరకు ఇలా దాదాపు రూ.50 లక్షల విలువైన సరకులను ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపించాం. మరో వారంలో అదనంగా దాదాపు రూ.1.5కోట్ల విలువైన సహాయక సామగ్రిని వరద బాధిత రాష్ట్రాలకు తరలిస్తాం’ అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు.
ఇంకా వరద ముంపులోనే పలు ప్రాంతాలు
ఆగస్టు 8 నుంచి వరదల్లో 231 మంది మరణించగా.. ఇంకా 32 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయక శిబిరాల్లో 14.5 లక్షల మంది తలదాచుకున్నారు. కుట్టనంద్, అలపుజా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. కేరళకు కేంద్రం రూ. 600 కోట్ల సాయాన్ని విడుదల చేయగా.. మరోవైపు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఇంతవరకూ రూ. 309 కోట్ల విరాళాలు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment