Supporting actions
-
మానవ తప్పిదం వల్లే కేరళ విపత్తు!
తిరువనంతపురం: జలవిలయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళలో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావస్తుంటే మరోవైపు వరద రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కేరళ వరదలు మానవ తప్పిదం వల్ల చోటుచేసుకున్న విపత్తేనని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకేసారి 40 ఆనకట్టల గేట్లు ఎత్తడమే ఈ కల్లోలానికి కారణమని రాష్ట్రంలోని లెఫ్ట్ సర్కారుపై రాష్ట్ర ప్రతిపక్షంతో పాటు బీజేపీ ఆరోపించాయి. విపత్తుపై న్యాయ విచారణకు డిమాండ్ ఈ మహాప్రళయానికి దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించాలని మంగళవారం కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. ‘పంబ నదీ పరీవాహకంలోని 9 డ్యాంలు, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో పెరియార్‌పై 11, త్రిస్సూర్‌లోని చాలకుడి నదీ పరీవాహకంలో ఆరు డ్యాంల నుంచి నీటిని ఒక్కసారి విడుదల చేస్తే ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయో అనేదానిపై ప్రభుత్వానికి అవగాహన శూన్యం. సరైన హెచ్చరికలు చేయకుండా ఒకేసారి 44 డ్యాంల ఆనకట్టల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.’ అని ఆయన అన్నారు. ఈ విపత్తుకు విజయన్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు చేశాకే నీటి విడుదల ‘మా నియంత్రణలో ఉన్న డ్యాంల విషయంలో తప్పిదం జరగలేదు. హెచ్చరికలు జారీచేశాకే నీటిని విడుదల చేశాం. నదులు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగాయి. డ్యాంల గేట్లు ఎత్తివేయడం వల్లే వరదలు సంభవించాయి అనడంలో అర్థంలేదు’ అని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు(కేఎస్ఈబీ) చైర్మన్ కేపీ శ్రీధరన్ వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు అర్థరహితమని డ్యాంల భద్రతా విభాగం చైర్మన్ రామచంద్రన్ చెప్పారు. ఈ వరద కేవలం అధిక వర్షపాతం వల్లే చోటుచేసుకోలేదని, నిర్లక్ష్యం తోడైందని విపత్తు పరిశోధన ప్రత్యేక విభాగం చైర్పర్సన్, ఢిల్లీ జేఎన్‌యూ వర్సిటీ ప్రొఫెసర్ అమృతా సింగ్ అన్నారు. శరవేగంగా పునర్నిర్మాణ పనులు: కేరళలో పునర్నిర్మాణం, పారిశుధ్య పనులు ఊపందు కున్నాయి. బురద, చెత్తతో నిండిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయడంతో ప్రజలు నిమగ్నమయ్యారు. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు ఇంట్లో నిండిన బురద, భారీ చెత్తను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. ‘మేం మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఏమీ మిగల్లేదు’ అని ఓ మహిళ చెప్పింది. బావులన్నీ మురికినీటితో కలుషితం కావడం వల్ల ప్రజలు తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. సులువుగా బీమా పరిహారం కేరళ వరద బాధితుల బీమా క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించేందుకు ఎల్ఐసీ నిబంధనలను సరళీకరించింది. పాలసీదారుడి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అతడి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయబోమని బుధవారం ప్రకటించింది. అధీకృత ప్రభుత్వ అధికారి ఇచ్చే ఏదైనా పత్రం లేదా ప్రభుత్వం నుంచి పరిహారం పొందినట్లు ఆధారాలు ఇస్తే చాలు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా(పీఎంజేజేబీవై) పథకంలో చేరిన పాలసీదారుల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు భాగస్వామ్య బ్యాంకులతో కలసిపనిచేస్తున్నామని తెలిపింది. కేరళకు సిద్ది వినాయక్ రూ.కోటి సాయం సాక్షి, ముంబై: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి సాయం ఇవ్వనున్నట్లు ప్రభాదేవిలోని సిద్ది వినాయక్ ఆలయ ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఈ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. పతంజలి నుంచి రూ.2 కోట్ల సాయం: బాబా రాందేవ్ వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ, కర్ణాటకలను ఆదుకునేందుకు పతంజలి సంస్థ తమ వంతు కృషిచేస్తోంది. ‘టూత్‌పేస్టులు మొదలుకొని మంచి నీటి బాటిళ్ల వరకు ఇలా దాదాపు రూ.50 లక్షల విలువైన సరకులను ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపించాం. మరో వారంలో అదనంగా దాదాపు రూ.1.5కోట్ల విలువైన సహాయక సామగ్రిని వరద బాధిత రాష్ట్రాలకు తరలిస్తాం’ అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. ఇంకా వరద ముంపులోనే పలు ప్రాంతాలు ఆగస్టు 8 నుంచి వరదల్లో 231 మంది మరణించగా.. ఇంకా 32 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయక శిబిరాల్లో 14.5 లక్షల మంది తలదాచుకున్నారు. కుట్టనంద్, అలపుజా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. కేరళకు కేంద్రం రూ. 600 కోట్ల సాయాన్ని విడుదల చేయగా.. మరోవైపు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఇంతవరకూ రూ. 309 కోట్ల విరాళాలు అందాయి. -
కాశ్మీర్లో చురుగ్గా సహాయ చర్యలు
* వరద తగ్గుముఖం, 1.30 లక్షల మందిని కాపాడిన సైన్యం * భారీగా ఆహార పదార్థాలు, సామగ్రి పంపిణీ * విరాళాలిచ్చి ఆదుకోవాలని దేశప్రజలకు ప్రధాని విజ్ఞప్తి శ్రీనగర్/న్యూఢిల్లీ: వరద విలయంలో చిక్కుకున్న జమ్మూకాశ్మీర్‌లో సహాయ కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. 11 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం నాటికి 1.30 లక్షల మంది బాధితులను సైన్యం రక్షించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు(ఎన్డీఆర్ఎఫ్) కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. వైమానికదళానికి చెందిన 89 రవాణా విమానాలు, హెలికాప్టర్లను సైన్యం వినియోగిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దాదాపు 30 వేల మంది సైనికులు నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనగర్ ప్రాంతంలోనే 21 వేల మంది సేవలందిస్తున్నారు. కాగా, భారీ వరదల కారణంగా అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌ను ఆదుకునేందుకు దేశ ప్రజలంతా విరాళాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. కాశ్మీర్లో ప్రస్తుతం వేర్పాటువాదులను పట్టించుకోవటం లేదని, సహాయ కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి సారించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్లో 1200 గ్రామాలు, జమ్మూలో 1100 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని, దాదాపు 400 గ్రామాలైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాయన్నారు. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం వద్ద రూ. 1100 కోట్ల నిధులు ఉన్నాయని, ఇందులో 90 శాతం నిధులను కేంద్రమే అందించిందని తెలిపారు. బాధితులకు రూ. 200 కోట్ల సాయం జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 200 కోట్ల సాయం ప్రకటించారు. ఈ ప్రకృతి విపత్తులో మృతుల కుటుంబ సభ్యులకు కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షలతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. సహాయ కార్యక్రమాలు - 31,500 ఆహార పొట్లాలు, 533 టన్నుల ఆహార పదార్థాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో జారవిడిచారు. 8200 దుప్పట్లు, వెయ్యి టెంట్లను సరఫరా చేశారు. - 80 వరకు సైనిక దళాల వైద్య బృందాలు కూడా సేవల్లో నిమగ్నమయ్యాయి. నాలుగు ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 21,500 మందికి చికిత్స అందించారు. 19 టన్నుల మందులను ఢిల్లీ నుంచి తరలించారు. - 13 టన్నుల నీటిని శుద్ధి చేసే టాబ్లెట్లు, 6 జల శుద్ధి ప్లాంట్లు శ్రీనగర్ చేరుకున్నాయి. - నౌకాదళ కమాండోల మూడో దళం కూడా రంగంలోకి దిగింది. 224 ఆర్మీ బోట్లను, 148 ఎన్డీఆర్ఎఫ్ పడవలను సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. తక్షణం ఆదుకోండి: సుప్రీం జమ్మూకాశ్మీర్‌లో వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సహాయ చర్యల సమన్వయం కోసం ఒక కేంద్రీకృత ఏజెన్సీని ఏర్పాటుచేసే విషయం ఆలోచించాలని కోరింది. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు చేపట్టిన చర్యల వివరాలను సోమవారం తమకు అందజేయాలంది. జమ్మూకాశ్మీర్ వరదల విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్న కేంద్రప్రభుత్వ వాదనను పక్కనబెడుతూ.. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తెలుగువారిని రక్షించండి జమ్మూకాశ్మీరులోని వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె. రామ్మోహనరావు ప్రధాని కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్‌ను కోరారు. నిట్ విద్యార్ధులతో పాటు 120 మంది తెలుగువా రు ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నారన్నారు. -
మిగిలింది మన్నే!
►మాలిన్ గ్రామాన్ని పూర్తిగా మింగేసిన కొండచరియలు ►ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ఆనవాలు కోల్పోయిన గ్రామం ►ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడింది 8 మంది మాత్రమే ►మృతుల సంఖ్య 42కి చేరిందని వెల్లడించిన పుణే కలెక్టర్ ►130 మంది గల్లంతు, శిథిలాల కిందే ఉన్నారంటున్న స్థానికులు ►పొక్లెయినర్లతో శరవేగంగా జరుగుతున్న సహాయక చర్యలు ►ఘటనాస్థలాన్ని సందర్శించిన రాజ్‌నాథ్, పవార్ తదితరులు సాక్షి, ముంబై: ప్రకృతి ఒడిలో ఉన్నామంటూ పరవశించిపోతున్న ఆ గ్రామాన్ని చూసి కొండకు కన్నుకుట్టిందా? ఏదైనా జీవిపై కన్నేసిన కొండచిలువ దానిని పూర్తిగా మింగేసి, ఎలా నుజ్జునుజ్జు చేస్తుందో పుణే జిల్లాలోని మాలిన్ గ్రామాన్ని కూడా ఈ కొండచరియలు అలా చేశాయి. 46 ఇళ్లున్న ఆ గ్రామంలో ఇప్పుడు కనీసం ఒక్క ఇల్లు కూడా మిగల్లేదంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతులను చూసి ఏడ్చేవారు కూడా లేరంటే అతిశయోక్తి కాదేమో?అసలు అక్కడ నిన్నటిదాకా ఓ గ్రామం ఉందని చెప్పినా నమ్మే పరిస్థితి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తవ్వుకుంటూ పోయినకొద్ది ఇళ్ల శిథిలాలు, వాటికి కింద విగత జీవులుగా మారిన దేహాలు బయటపడుతున్నాయి. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను వృథా ప్రయాసగా కొందరు చెబుతున్నారంటే ఇక కనీసం ఒక్కరు కూడా ఊపిరితో బయటపడలేదని పరిస్థితి కనిపిస్తోంది. 30కి చేరిన మృతుల సంఖ్య... బుధవారం జరిగిన మాలిన్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరో 130 మందికిపైగా ఆచూకి గల్లంతైంది. వీరంతా శిథిలాలకింద ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నలుగురిని మాత్రమే గురువారం ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు. మరో పది మృతదేహాలను కూడా బయటకు తీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం... వర్షం, బురదతోపాటు గ్రామానికి చేరుకోలని ప్రతికూల పరిస్థితులు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు. బుధవారం రాత్రంతా కూడా శిథిలాల తొలగింపు కొనసాగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో భారీగా వర్షం కురవడంతో సహాయక చర్యలను కాసేపు ఆపారు. 30 నిమిషాల తర్వాత మళ్లీ ప్రారంభించారు. జేసీబీలు, పొక్లెయిన్ల సాయంతో మట్టిని తొలగిస్తూ శిథిలాల కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని చూస్తున్నారు. ఊపిరితో ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసు కుక్కల సాయం కూడా తీసుకుంటున్నారు. అత్యాధునిక పరికరాలతో కూడా బతికున్నవారి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు మరో రెండు ఎస్డీఆర్ఎఫ్లు సాక్షి, ముంబై: విపత్తులు ఎదురైనప్పుడు సత్వరమే సహాయక చర్యలు అందించేందుకు మరో రెండు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) కంపెనీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రిమండలి సమావేశంలో గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 428 పదవులను కొత్తగా సృష్టించి, వీటిని ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ద్వారా భర్తీ చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఎస్డీఆర్ఎఫ్ ప్రస్తుతం పుణే సమీపంలోని తలేగావ్‌లో ఉంది. రాష్ట్రంలో ఏ మూలకు, ఎలాంటి ఆపత్తు వచ్చిన ఇక్కడి నుంచి సిబ్బంది, అధికారులు వెళ్లాల్సి వస్తోంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా రెండు కంపెనీలు స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కంపెనీలో మూడు బృందాలు అంటే అధికారులు, సిబ్బంది కలిసి 45 మంది ఉంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)లో ప్రస్తుతం 1,145 మంది ఉన్నారు. ఇది మహారాష్ట్ర గుజరాత్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోని విపత్తుల బాధ్యతలు చూసుకుంటోంది. ముంబైలో ఒకరి మృతి ఐదుగురికి గాయాలు ముంబై: వర్షం జోరుకు కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. చెంబూర్‌లో గురువారం కొండచరియలు విరిగిపడడంతో ఐదేళ్ల బాలుడు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే... అశోక్‌నగర్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న కొండల కింద గుడిసెలు వేసుకొని నివసిస్తున్నవారిపై ఒక్కసారిగా పెద్దమొత్తంలో మట్టి, రాళ్లు వచ్చి పడ్డాయి. ఈ సమయంలో గుడిసె ముందు ఆడుకుంటున్న గణేశ్ ఖురడేతోపాటు అక్కడే కూర్చున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సచారం అందుకున్న బీఎంసీ విపత్తుల నిర్వహణ బృందం ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాలకింద చిక్కుకున్న ఆరుగురిని బయటకు తీసి సమీపంలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడని, మిగతా ఐదుగురికి ప్రాణాపాయమేమీ లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొండ సమీపంలో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది.