మిగిలింది మన్నే!
►మాలిన్ గ్రామాన్ని పూర్తిగా మింగేసిన కొండచరియలు
►ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ఆనవాలు కోల్పోయిన గ్రామం
►ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడింది 8 మంది మాత్రమే
►మృతుల సంఖ్య 42కి చేరిందని వెల్లడించిన పుణే కలెక్టర్
►130 మంది గల్లంతు, శిథిలాల కిందే ఉన్నారంటున్న స్థానికులు
►పొక్లెయినర్లతో శరవేగంగా జరుగుతున్న సహాయక చర్యలు
►ఘటనాస్థలాన్ని సందర్శించిన రాజ్‌నాథ్, పవార్ తదితరులు
సాక్షి, ముంబై: ప్రకృతి ఒడిలో ఉన్నామంటూ పరవశించిపోతున్న ఆ గ్రామాన్ని చూసి కొండకు కన్నుకుట్టిందా? ఏదైనా జీవిపై కన్నేసిన కొండచిలువ దానిని పూర్తిగా మింగేసి, ఎలా నుజ్జునుజ్జు చేస్తుందో పుణే జిల్లాలోని మాలిన్ గ్రామాన్ని కూడా ఈ కొండచరియలు అలా చేశాయి. 46 ఇళ్లున్న ఆ గ్రామంలో ఇప్పుడు కనీసం ఒక్క ఇల్లు కూడా మిగల్లేదంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతులను చూసి ఏడ్చేవారు కూడా లేరంటే అతిశయోక్తి కాదేమో?అసలు అక్కడ నిన్నటిదాకా ఓ గ్రామం ఉందని చెప్పినా నమ్మే పరిస్థితి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తవ్వుకుంటూ పోయినకొద్ది ఇళ్ల శిథిలాలు, వాటికి కింద విగత జీవులుగా మారిన దేహాలు బయటపడుతున్నాయి. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను వృథా ప్రయాసగా కొందరు చెబుతున్నారంటే ఇక కనీసం ఒక్కరు కూడా ఊపిరితో బయటపడలేదని పరిస్థితి కనిపిస్తోంది.
30కి చేరిన మృతుల సంఖ్య...
బుధవారం జరిగిన మాలిన్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరో 130 మందికిపైగా ఆచూకి గల్లంతైంది. వీరంతా శిథిలాలకింద ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది నలుగురిని మాత్రమే గురువారం ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు. మరో పది మృతదేహాలను కూడా బయటకు తీసినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం...
వర్షం, బురదతోపాటు గ్రామానికి చేరుకోలని ప్రతికూల పరిస్థితులు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు. బుధవారం రాత్రంతా కూడా శిథిలాల తొలగింపు కొనసాగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో భారీగా వర్షం కురవడంతో సహాయక చర్యలను కాసేపు ఆపారు. 30 నిమిషాల తర్వాత మళ్లీ ప్రారంభించారు. జేసీబీలు, పొక్లెయిన్‌ల సాయంతో మట్టిని తొలగిస్తూ శిథిలాల కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని చూస్తున్నారు. ఊపిరితో ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసు కుక్కల సాయం కూడా తీసుకుంటున్నారు. అత్యాధునిక పరికరాలతో కూడా బతికున్నవారి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
విపత్తులను ఎదుర్కొనేందుకు
మరో రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు
సాక్షి, ముంబై: విపత్తులు ఎదురైనప్పుడు సత్వరమే సహాయక చర్యలు అందించేందుకు మరో రెండు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్) కంపెనీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రిమండలి సమావేశంలో గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 428 పదవులను కొత్తగా సృష్టించి, వీటిని ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ద్వారా భర్తీ చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఎస్డీఆర్‌ఎఫ్ ప్రస్తుతం పుణే సమీపంలోని తలేగావ్‌లో ఉంది. రాష్ట్రంలో ఏ మూలకు, ఎలాంటి ఆపత్తు వచ్చిన ఇక్కడి నుంచి సిబ్బంది, అధికారులు వెళ్లాల్సి వస్తోంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా రెండు కంపెనీలు స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కంపెనీలో మూడు బృందాలు అంటే అధికారులు, సిబ్బంది కలిసి 45 మంది ఉంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్)లో ప్రస్తుతం 1,145 మంది ఉన్నారు. ఇది మహారాష్ట్ర గుజరాత్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోని విపత్తుల బాధ్యతలు చూసుకుంటోంది.
ముంబైలో ఒకరి మృతి ఐదుగురికి గాయాలు
ముంబై: వర్షం జోరుకు కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. చెంబూర్‌లో గురువారం కొండచరియలు విరిగిపడడంతో ఐదేళ్ల బాలుడు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే... అశోక్‌నగర్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న కొండల కింద గుడిసెలు వేసుకొని నివసిస్తున్నవారిపై ఒక్కసారిగా పెద్దమొత్తంలో మట్టి, రాళ్లు వచ్చి పడ్డాయి. ఈ సమయంలో గుడిసె ముందు ఆడుకుంటున్న గణేశ్ ఖురడేతోపాటు అక్కడే కూర్చున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సచారం అందుకున్న బీఎంసీ విపత్తుల నిర్వహణ బృందం ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాలకింద చిక్కుకున్న ఆరుగురిని బయటకు తీసి సమీపంలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడని, మిగతా ఐదుగురికి ప్రాణాపాయమేమీ లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొండ సమీపంలో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది.