* వరద తగ్గుముఖం, 1.30 లక్షల మందిని కాపాడిన సైన్యం
* భారీగా ఆహార పదార్థాలు, సామగ్రి పంపిణీ
* విరాళాలిచ్చి ఆదుకోవాలని దేశప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
శ్రీనగర్/న్యూఢిల్లీ: వరద విలయంలో చిక్కుకున్న జమ్మూకాశ్మీర్‌లో సహాయ కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. 11 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం నాటికి 1.30 లక్షల మంది బాధితులను సైన్యం రక్షించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు(ఎన్‌డీఆర్‌ఎఫ్) కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. వైమానికదళానికి చెందిన 89 రవాణా విమానాలు, హెలికాప్టర్లను సైన్యం వినియోగిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
దాదాపు 30 వేల మంది సైనికులు నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనగర్ ప్రాంతంలోనే 21 వేల మంది సేవలందిస్తున్నారు. కాగా, భారీ వరదల కారణంగా అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌ను ఆదుకునేందుకు దేశ ప్రజలంతా విరాళాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం వేర్పాటువాదులను పట్టించుకోవటం లేదని, సహాయ కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి సారించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్‌లో 1200 గ్రామాలు, జమ్మూలో 1100 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని, దాదాపు 400 గ్రామాలైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాయన్నారు. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం వద్ద రూ. 1100 కోట్ల నిధులు ఉన్నాయని, ఇందులో 90 శాతం నిధులను కేంద్రమే అందించిందని తెలిపారు.
బాధితులకు రూ. 200 కోట్ల సాయం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 200 కోట్ల సాయం ప్రకటించారు. ఈ ప్రకృతి విపత్తులో మృతుల కుటుంబ సభ్యులకు కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షలతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు.
సహాయ కార్యక్రమాలు
- 31,500 ఆహార పొట్లాలు, 533 టన్నుల ఆహార పదార్థాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో జారవిడిచారు. 8200 దుప్పట్లు, వెయ్యి టెంట్లను సరఫరా చేశారు.
- 80 వరకు సైనిక దళాల వైద్య బృందాలు కూడా సేవల్లో నిమగ్నమయ్యాయి. నాలుగు ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 21,500 మందికి చికిత్స అందించారు. 19 టన్నుల మందులను ఢిల్లీ నుంచి తరలించారు.
- 13 టన్నుల నీటిని శుద్ధి చేసే టాబ్లెట్లు, 6 జల శుద్ధి ప్లాంట్లు శ్రీనగర్ చేరుకున్నాయి.
- నౌకాదళ కమాండోల మూడో దళం కూడా రంగంలోకి దిగింది. 224 ఆర్మీ బోట్లను, 148 ఎన్‌డీఆర్‌ఎఫ్ పడవలను సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు.
తక్షణం ఆదుకోండి: సుప్రీం
జమ్మూకాశ్మీర్‌లో వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సహాయ చర్యల సమన్వయం కోసం ఒక కేంద్రీకృత ఏజెన్సీని ఏర్పాటుచేసే విషయం ఆలోచించాలని కోరింది. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు చేపట్టిన చర్యల వివరాలను సోమవారం తమకు అందజేయాలంది. జమ్మూకాశ్మీర్ వరదల విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్న కేంద్రప్రభుత్వ వాదనను పక్కనబెడుతూ.. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
తెలుగువారిని రక్షించండి
జమ్మూకాశ్మీరులోని వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె. రామ్మోహనరావు ప్రధాని కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్‌ను కోరారు. నిట్ విద్యార్ధులతో పాటు 120 మంది తెలుగువా రు ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నారన్నారు.
కాశ్మీర్‌లో చురుగ్గా సహాయ చర్యలు
Published Sat, Sep 13 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement