న్యాయ విచారణకు పట్టు | Hold judicial inquiry | Sakshi
Sakshi News home page

న్యాయ విచారణకు పట్టు

Published Tue, Jul 8 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

న్యాయ విచారణకు పట్టు

న్యాయ విచారణకు పట్టు

  • కూడగి ఘటనపై విపక్షాల ఆందోళన
  •  మెజిస్టీరియల్ విచారణతో న్యాయం జరగదని సూచన
  •  బీజేపీ సభ్యుల వాకౌట్
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లా కూడగిలో థర్మల్ విద్యుత్కేంద్రం ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసు కాల్పులు జరిగిన సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ చేపట్టాలని సోమవారం శాసన సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ రైతులపై లాఠీ ఛార్జి, కాల్పులు జరపడం అసమంజసమని విమర్శించారు. రైతులను శాంతింపజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

    ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేస్తూ, జిల్లాధికారి పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుందని తెలిపారు. అయితే స్థానికులు జిల్లా యంత్రాంగపైనే ఆగ్రహం వ్యక్తం చేసినందున వారికి న్యాయం జరగదన్నారు. కనుక న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానికులకు ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పడానికి ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉద్యోగాలివ్వలేదని బీజేపీ సభ్యుడు గోవింద కారజోళ ఆరోపించారు.

    నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తామనే మాటనూ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని జేడీఎస్ పక్షం నాయకుడు కుమార స్వామి అన్నారు. హోం మంత్రి కేజే. జార్జ్ చర్చకు సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల వ్యయంతో ఈ విద్యుత్కేంద్రాన్ని చేపట్టిందని తెలిపారు. అనేక విదేశ కంపెనీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయని వెల్లడించారు.

    విద్యుత్కేంద్రం నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో, దీనిని వ్యతిరేకిస్తే విదేశ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావని ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి చికిత్సలు చేయిస్తున్నామని, రైతులకు సాంత్వన కలిగించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని వివరించారు. గాయపడిన ఇద్దరు రైతులకు రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం ప్రకటించామని తెలిపారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement