సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీకి సంబంధించి వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. విపక్షాల విమర్శలు, ఫిర్యాదుల నేపథ్యంలో వడ్డీ చెల్లింపులను ఆరా తీసిన ప్రభుత్వానికి.. ఒక్కోచోట ఒక్కో తీరుగా లెక్కలున్నట్లు, కొన్ని చోట్ల రైతుల నుంచి వడ్డీనీ వసూలు చేసినట్లు తెలిసింది. వడ్డీ లెక్కలన్నీ నిగ్గుతేల్చగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుందని తేలింది. బ్రాంచీల వారీగా రైతుల ఖాతాలు మళ్లీ పరిశీలించి ఎవరిపై వడ్డీ భారం పడింది, ఎంత చెల్లించాలి లాంటి లెక్కలు తీయ డం అసాధ్యమని, ఎక్కువ సమయం పడుతుందని సర్కారు అభిప్రాయానికి వచ్చింది.
మూడేళ్లలో రూ.17 వేల కోట్లు..
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసింది. రూ.లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేసింది. రూ. 17 వేల కోట్లను మూడేళ్లలో బ్యాంకులకు చెల్లించి 35 లక్షల మంది రైతులు రుణ విముక్తులైనట్లు ప్రకటించింది. కొన్ని బ్యాంకులు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేశాయని ఆరోపణలొచ్చాయి.
శాసనసభలో విపక్షాలూ ఈ అంశాన్ని లెవనెత్తడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘ఎక్కడైనా ఫిర్యా దులుంటే.. రూ.100 కోట్లు.. రూ. 200 కోట్లు ఉంటే చెల్లించేద్దాం.. విచారణ చేప ట్టండి’అని అధికారులను పురమాయించారు. మాఫీ అమలును పరిశీలించిన అధికారులు.. వడ్డీల అంశం సంక్లిష్టంగా ఉందని, సమస్యను జటిలం చేయకుండా ఉండటమే మంచిదని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
రాష్ట్రం 4 శాతం.. కేంద్రం 7 శాతం..
సాధారణంగా పంట రుణాల వడ్డీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రాష్ట్రం 4, కేంద్రం 7 శాతం బ్యాంకులకు చెల్లిస్తాయి. రుణాల గడువు మీరితే నిబంధన వర్తించకపోతే వడ్డీ లేని రుణ పథకం వర్తించకపోగా.. 11 శాతం వడ్డీని రైతులే భరించాల్సి వస్తుంది. ప్రభుత్వం రుణమాఫీని దశల వారీగా చెల్లించడంతో కొన్నిచోట్ల రుణాలను గడువు మీరిన ఖాతాలో వేసుకున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు ఒక్కోచోట ఒక్కో తీరుగా లెక్కలు ఉండటం.. కొన్ని చోట్ల రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment