వడ్డీ.. విరిచేను నడ్డి!
► రైతులను బజారుకీడుస్తున్న రుణమాఫీ
► విడత వారీ సర్దుబాటుతో అవస్థలు అమలుకు నోచుకోని రెండో విడత మాఫీ
► ఏడాది దాటితే 12 నుంచి 14.5 శాతం వడ్డీ వసూలు
► ఆర్థిక ఇక్కట్లలో అన్నదాత
రుణాలన్నీ మాఫీ చేస్తాం.. ఒక్క పైసా కట్టక్కర్లేదని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ రైతులను బజారుకీడుస్తోంది. ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారిన అన్నదాతలు.. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో దొంగలు. ఏడాది గడువు దాటినా రుణాలు చెల్లించలేని రైతుల పేర్లు మొండి ఖాతాల జాబితాలో చేరనున్నాయి. ఇదే సమయంలో వడ్డీ తడిసి మోపెడు కానుంది.
నోటీసు ఇవ్వడంతో రుణం చెల్లించినా
నా పేరు ఏసయ్య. అవుకులో 4.50 ఎకరాల పొలం ఉంది. పెట్టుబడి కోసం స్థానిక స్టేట్ బ్యాంక్‌లో 2012లో రూ.65 వేల రుణం తీసుకున్నా. అసలు, వడ్డీ కలిపి రూ.1.35 లక్షలు అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కింద కేవలం రూ. 20వేలు మాత్రమే బ్యాంకులో జమ అయింది. అసలు వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు గత జనవరిలో నోటీసులు పంపగా.. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకొని రూ. 1.15 లక్షలు చెల్లించినా. - ఏసయ్య, రైతు, అవుకు
రుణమాఫీ మోసం
నా పేరిట రాయలసీమ గ్రామీణ బ్యాంక్‌లో రూ.52,300 అప్పుంది. కోడుమూరు సొసైటీలో రూ.25 వేల అప్పు తీసుకున్నా. ఇందులో గ్రామీణ బ్యాంక్‌లో ఒక్కటే అప్పు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపించినా.. 20 శాతం మాత్రమే మాఫీ చేసినారు. మిగిలిన అప్పు బ్యాంక్‌లో రెన్యూవల్ చేసుకునేందుకు ప్రైవేట్‌గా రూ.3ల వడ్డీకి తీసుకొచ్చి కట్టినా. మాఫీ డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదు. ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసగిస్తోంది. - బ్రహ్మయ్య ఆచారి, రైతు, కోడుమూరు
సాక్షి, కర్నూలు: జిల్లాలో మొత్తం రైతులు 6.50 లక్షలు. ఇందులో 5.25 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో సుమారు రూ.2,500 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని నమ్మించిన బాబు.. అధికారంలోకి రాగానే అసలు రూపం బయటపెట్టారు. మాట మార్చి.. కొర్రీలు పెట్టి.. మమ అనిపించారు. జిల్లా విషయానికొస్తే 4,41,782 మంది రైతులకు మూడు విడతల్లో రూ.680.75 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మిగిలిన 83వేల మంది రైతులను వివిధ కారణాలతో అనర్హులుగా తేల్చారు. అరకొర మాఫీ అయినా సక్రమంగా చేశారా అంటే అదీలేదు. ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం వడ్డీలకూ సరిపోని పరిస్థితి. ఫలితంగా ఏడాది లోపు రుణాలను పునరుద్ధరించుకోకపోతే వడ్డీ భారం ఉక్కిరిబిక్కిరి చేయనుంది.
మరో విడత మాఫీ కోసంఎదురు చూపులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మరో విడత రుణమఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఆ మొత్తం విడుదలయితే వడ్డీ, రుణాలను పునరుద్ధరించుకోవాలని చూస్తున్నా ఎప్పటికి చేస్తారో తెలియని పరిస్థితి. ఈలోపు గడువు దాటిపోతే బ్యాంకర్లు పునరుద్ధరిస్తారో లేదోనని రైతుల్లో ఆందోళన మొదలయింది. అదే జరిగితే.. అసలు, వడ్డీ చెల్లించే స్థోమత లేని అన్నదాత వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది.
పునరుద్ధరణ తప్పదు..
పంట రుణాలకు ఏడాది వరకు ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఏడాది దాటి ఒక్క రోజు గడిచినా వడ్డీ 12 శాతం నుంచి 14.5 శాతానికి పెరిగిపోతుంది. ఏడాది గడువులోపు చెల్లిస్తే ప్రభుత్వ ప్రోత్సాహకం కింద 3 శాతం వడ్డీ తిరిగి చెల్లిస్తుంది. దాన్ని ఆ రైతు పొదుపు ఖాతాలో జమ చేస్తారు. నికరంగా 4 శాతం అంటే పావలా వడ్డీ చెల్లించినట్లు అవుతుంది. అయితే ఏడాది గడువు దాటితే రూ.12వేల నుంచి రూ.14,500 వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలు గడిచే కొద్డీ ఆరు నెలలకు ఒకసారి అసలు, వడ్డీ కలిసి మరింత ఊబిలోకి నెట్టనుంది. ఈ నేపథ్యంలో రుణాలను పునరుద్ధరించుకోవడం మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.