ఎంత పని చేశావమ్మా..
రుణాలు ఆమె పాలిట మరణ శాసనాలయ్యాయి... అప్పులు ఆమెను అథఃపాతాళానికి తొక్కేశాయి. వడ్డీలకు అప్పు తీసుకుని వేసిన బోర్లు ఆ కుటుంబాన్నే మింగేశాయి. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానాలు ఆమెకు భరోసా ఇవ్వలేకపోయాయి. తానుపోతే.. పెళ్లికెదిగిన కూతుళ్లు ఏమైపోతారన్న భయం ఆ తల్లిని కుంగదీసింది. రక్తం పంచి ప్రాణం పోసిన తల్లే.. విషమిచ్చే పాషాణమైంది.. చివరికి పెద్దబిడ్డతో పాటు తనూ తనువు చాలించింది. మరో బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
పుత్తూరు: ఎన్ని కష్టాలొచ్చినా నిబ్బరంతో ఎదుర్కొన్న బిడ్డల్ని కాపాడుకున్న ఆ తల్లి ఆత్మస్థైర్యాన్ని అప్పులు దెబ్బతీశాయి. తిండికున్నా.. లేకున్నా.. కాడిని నమ్ముకుని జీవించిన తల్లికి. రుణాలు.. పాడెనే మిగిల్చాయి. మనస్సున్న ప్రతి ఒక్కరికీ కదలిస్తున్న ఈ విషాదమంతా...నగరి నియోజకవర్గం మండల కేంద్రమైన నిండ్ర బీసీ కాలనీలోని మాధవి కుటుంబానిదే. వివరాల్లోకి వెళితే... క్రిష్ణయ్య, మాధవి దంపతులు. వీరికి శరణ్య, గాయత్రి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానికంగా వీరికి ఎకరా పొలం ఉంది. ఇందులో బోరు వేసి పంటలు పండించుకుని తద్వారా సంఘంలో గౌరవంగా బతకాలని వారు భావించారు. శరణ్య, గాయిత్రిలను బాగా చదివించాలనుకున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఉన్న పొలంలో మల్లెపూల తోట నాటి సాగు చేస్తే ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అప్పలు చేసి బోర్లు వేశారు. అయినా చుక్కనీరు పడలేదు. దీంతో అప్పులు చేసి 12 బోర్లు వేశారు.
అయినా దురదృష్టం వారిని వెంటాడింది. బోర్లనుంచి నీరు రాలేదు సరికదా... అందుకు చేసిన అప్పు రూ.3 లక్షలు కొండలా పేరుకుపోయింది. ఇదే సమయంలో మాధవి డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న రుణం మాఫీ కాలేదు. దీంతో అప్పుతో పాటు వడ్డీ భారీగా కట్టాల్సివచ్చింది. దంపతులిద్దరూ... కూలీ పనులకు వెళ్లగా వచ్చిన సొమ్ము కాస్తా రోజూవారి జీవనానికే సరిపోయేది. ఈ సమయంలో పుత్తూరులోని ఓ ప్రయివేటు జూనియర్ కాలేజీలో పెద్ద కుమార్తె శరణ్య ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుకు ఫీజు చెల్లించాలనే ఒత్తిడి ఏర్పడింది. ఇంట్లో పరిస్ధితి తెలుసుకున్న శరణ్య తన చదువును మానేస్తాని తల్లి మాధవికి తెలిపింది. మూడు రోజులుగా ఇంటిలోనే ఉన్న శరణ్యను చూసిన మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది.
చిన్నకుమార్తె గాయత్రీ 8 వ తరగతి చదువుకుంటోంది. ఒకవైపు ఎదిగిన కుమార్తెలు వారిని చదివించలేని పరిస్థితి, అప్పులిచ్చిన వారి ఒత్తిడి సమాధానం చెప్పలేని పరిస్ధితిలో భర్త క్రిష్ణయ్యను చూసి పూర్తిగా నిస్సహాయలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే భర్త ఇంటిలో లేని సమయంలో మాధవి కుమార్తెలిద్దరితో కలసి కఠిన నిర్ణయం తీసుకుని పురుగుల మందు వారికి ఇచ్చి తాను సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు ప్రభావానికి పిల్లలిద్దరూ కేకలు వేయడంతో స్థానికులు వైద్యశాలకు తరలించారు. తల్లి మాధవి, పెద్దకుమార్తె శరణ్యలు మృతిచెందగా గాయిత్రి తిరుపతి రూయాలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది.