
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వర్గాలుగా విడిపోయిన నాయకులతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజమే అయినప్పటికీ... ఎన్నికల సంవత్సరంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సొంత పార్టీ యంత్రాంగాన్నే అయోమయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్కలకు మద్దతుదారులుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కీలక నాయకులుగా ఉన్నారు. భట్టి విక్రమార్క వర్గానికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాయకత్వం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్, బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ కూడా ప్రేంసాగర్ వర్గంగానే కొనసాగుతున్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగించాలని రేవంత్‌రెడ్డి నేతృత్వలో ఢిల్లీ వెళ్లిన 19 మంది నేతల బృందంలో వీరు కూడా ఉన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి తన స్థాయి తగ్గకుండా తనదైన రీతిలో వ్యవహరిస్తున్నారు.
బస్సు యాత్ర సమయంలోనే విభేదాలు సుస్పష్టం
ప్రజా చైతన్య యాత్ర పేరుతో గత మేనెలలో ఉత్తమ్ బృందం ఐదు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సు యాత్ర తమ నియోజకవర్గాల్లోకి వచ్చినప్పుడే ప్రేంసాగర్‌రావు గ్రూపు నాయకులు హడావుడి చేశారే తప్ప పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చెన్నూర్‌లో బహిరంగసభ వెలవెలబోయే పరిస్థితుల్లో బోడ జనార్దన్ చివరి నిమిషంలో చేసిన ప్రయత్నంతో పరువు నిలిచింది. ఉత్తమ్, భట్టి వర్గాలుగా బాహాటంగానే బలప్రదర్శనలు చేశారు.
ఇక గత నెలలో రంజాన్ సందర్భంగా మహిళల కోసం ప్రేంసాగర్‌రావు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, భట్టి విక్రమార్కతో పాటు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీకే అరుణ తదితర నాయకులను ఆహ్వానించారు. గత కొంతకాలంగా భట్టి విక్రమార్క గ్రూపులో శ్రీధర్‌బాబుతో కలిసి కార్యక్రమాలు చేస్తున్న ప్రేంసాగర్‌రావుకు రేవంత్ వర్గం నుంచి వచ్చిన ముగ్గురు నేతల మద్దతు లభించడంతో మరింత బలం చేకూరింది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు రాష్ట్రస్థాయిలో ఉన్న రెండు ప్రధాన వర్గాలకు ముఖ్య నాయకులుగా మారడంతో రాజకీయం వీరి చుట్టూనే తిరుగుతోంది.
మంచిర్యాల జిల్లాలో హోరాహోరీ
మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గ్రూపులో ఉండి, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా, మాజీ ఎమ్మెల్యేగా అరవింద్‌రెడ్డికే సీటొస్తుందని ఆయన వర్గీయులు చెపుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా పర్యటిస్తూ, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈసారి మంచిర్యాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమనే ధీమాతో ఉన్నారు.
చెన్నూర్‌లో మాజీ మంత్రి బోడ జనార్దన్ ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు వర్గంలో చేరిపోయారు. అరవింద్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టికెట్టు వేటలో ఉన్నారు.
బెల్లంపల్లిలో కూడా ఇదే వర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరోసారి పోటీకి సిద్ధపడుతుండగా, ప్రేంసాగర్‌రావు గ్రూపు నుంచి మున్సిపల్ కౌన్సిలర్ రొడ్డ శారద ప్రధాన పోటీదారుగా మారారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని సైతం టిక్కెట్టు రేసులో ఉన్నారు.
నిర్మల్ మినహా మిగతా చోట్ల రెండు వర్గాలు
డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్‌రెడ్డితో పోటీపడే నాయకులు సమీపంలో మరొకరు లేడు. నిర్మల్‌తో పాటు ముథోల్, ఖానాపూర్‌లలో కూడా ఆయన వర్గీయులే పార్టీ టిక్కెట్ల రేసులో ముందున్నారు. ముథోల్, ఖానాపూర్‌లలో టిక్కెట్ల కోసం పోటీ ఉన్నా, మహేశ్వర్‌రెడ్డి ఎవరి పేరు చెపితే వారికే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి నెలకొంది.
కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉత్తమ్ వ్యతిరేకవర్గం భవిష్యత్తులో కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 11వ తేదీన ఏఐ సీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా అనేక నియోజకవర్గాల్లో ప్రేంసాగర్‌రావు వర్గీయులు బలప్రదర్శనకు దిగడం గమనార్హం.
ఆసిఫాబాద్‌లో సగం సగం...
ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీ ఉద్యమం తరువాత తన గ్రాఫ్‌ను మరింత పెంచుకున్నారు. ఇక్కడ ఆయన మినహా మరో పేరున్న నాయకుడు కాంగ్రెస్‌లో లేరు. తన వర్గంలో ఉన్న ఆత్రం సక్కుకు ఆదివాసీ ఉద్యమం సందర్భంగా పోలీసులు పెట్టిన కేసుల విషయంలో ప్రేంసాగర్‌రావు తగిన తోడ్పాటు అందించడం గమనార్హం.
సిర్పూర్‌లో మహేశ్వర్‌రెడ్డి వర్గంలో బీసీ ఉద్యమ నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఉన్నారు. సిడాం గణపతి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి వర్గీయుడైన రావి శ్రీనివాస్ ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు క్యాంపులో ఉన్నారు. ఆయన టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ బీసీ, స్థానికత అంశాలు తెరపైకి వస్తే శ్రీనివాస్ యాదవ్‌కే అధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment