
వనపర్తిలోని మల్లిక నర్సింగ్ హోమ్‌లోని లేబర్ రూంను సీజ్ చేస్తున్న అధికారులు(ఫైల్)
సాక్షి, వనపర్తి : లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం చట్టరీత్యా నేరం అని తెలిసినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏమాత్రం ఆగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చేపట్టిన తనిఖీల్లోనే ఈ విషయం స్పష్టమైంది. వనపర్తి జిల్లాలో కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశాల మేరకు కొన్ని రోజులపాటు లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిలిపివేసినట్లు చెప్పుకున్న ఆస్పత్రుల నిర్వాహకులు, ఆర్‌ఎంపీలు, స్కానింగ్‌సెంటర్ల నిర్వాహకులు ప్రస్తుతం రూటు మార్చారు. దందాను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తేలితే పలువురు తల్లిదండ్రులు అబార్షన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తిపడి ఆస్పత్రుల నిర్వాహకులు ఈ పనికి ఒప్పుకుంటున్నారు. ఫలితంగా ఆడపిల్లల నిష్పత్తి జిల్లాల్లో తగ్గిపోతోంది. బుధవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
కొత్త పోకడలతో...
లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వైద్యులు కొత్త పోకడలను ఎంచుకున్నారు. తమకు తెలిసిన వారి ద్వారా వస్తేనే చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఇందుకు రూ. 10వేల నుంచి రూ.20వేల వరకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాలు, తండాల్లో ఉండే ఆర్‌ఎంపీ వైద్యులు ఇలాంటి కేసులను ఎక్కువగా రాబట్టి వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌లో ఉండే ఆస్పత్రులు, క్లినిక్, స్కానింగ్ సెంటర్లకు తీసుకువస్తున్నారు. వీరికి స్కానింగ్ చేసిన అనంతరం కడుపులో పెరుగుతున్నది ఆడశిశువు అని తెలిస్తే క్లినిక్‌లో కాకుండా రహస్య ప్రాంతాల్లో అబార్షన్లు చేయిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఇటీవల వైద్యశాఖ అధికారులు, పోలీసుల తనిఖీలు చేసినా బయటపడటం లేదు.
నెలలతో సంబంధమే లేదు
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 20వారాల కంటే తక్కువగా ఉన్న గర్భాన్ని అత్యవసర ప రిస్థితి అయితేనే న్యాయ సలహా తీసుకొని అ బార్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ పలువురు వై ద్యులు, ఆర్‌ఎంపీలు అవేవీ పట్టించుకోవడం లే దు. డబ్బే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 20 వారాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నా తొలగిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన కొన్ని దాడుల్లో తేటతెల్లమైంది.
విస్తుపోయే ఘటనలు..
♦ ఆగస్టు 11న వనపర్తి డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులుకు పెబ్బేరులోని కృష్ణ నర్సింగ్ హోమ్‌లో అ బార్షన్ చేస్తున్నట్లు పక్కా సమాచారం రావడం తో తనిఖీచేశారు. 6నెలల గర్భాన్ని తొ లగించేం దుకు ఇంజక్షన్లు, మందులను ఇచ్చిన ట్లు తేలింది. అదేవిధంగా పెబ్బేరులోని సాయి రాం ఆస్పత్రిలోని భవిత ల్యాబ్‌లో అనుమతిలేకుండా ఉన్న స్కానింగ్ మిషన్‌ను కూడా సీజ్ చేశారు.
♦ ఆగస్టు 6న వనపర్తి మల్లిక నర్సింగ్ హోమ్‌లో ఎనిమిది నెలల గర్భిణీకి అబార్షన్ చేస్తున్నారన్న సమాచారంతో డీఎంహెచ్‌ఓ తనిఖీలు నిర్వహించారు. అబార్షన్‌కు వాడిన మందులు లభించాయి. వెంటనే అక్కడి నుంచి ఆస్పత్రిలో ఉన్నవారు పారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment