మైమరిపించే కళాఖండాలు | International Museum day in Salarjung Museum | Sakshi
Sakshi News home page

మైమరిపించే కళాఖండాలు

Published Fri, May 17 2019 8:03 AM | Last Updated on Mon, May 20 2019 11:26 AM

International Museum day in Salarjung Museum - Sakshi

సాలార్‌జంగ్‌ మ్యూజియం.

చార్మినార్‌: మ్యూజియం అంటే అందరికీ గుర్తొచ్చేది సాలార్జంగ్‌ మ్యూజియం..పాతబస్తీలో ఇదొక్కటే కాదు ఇంకా ఉన్నాయి. హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి రోజూ దేశ, విదేశీ పర్యాటకులు వీటిని సందర్శిస్తున్నారు. 

సాలార్‌జంగ్‌ మ్యూజియం  
దారుషిఫా చౌరస్తాకు సమీపంలో మూసీనది పక్కన 1968లో నూతనంగా నిర్మించిన భవనంలోకి సాలార్‌జంగ్‌ మ్యూజియాన్ని మార్చారు. అంతకుముందు సాలార్‌జంగ్‌ మ్యూజియం దివాన్‌దేవుడిలో కొనసాగింది. 1,2,3 సాలార్‌జంగ్‌లు భారతదేశంతో పాటు విదేశాల నుంచి సేకరించిన దాదాపు 48 వేల కళాఖండాలను మ్యూజియంలో పొందుపరిచారు. రెబేకా (పాలరాతి ముసుగు సుందరి) గంటలు కొట్టే గడియారంతో పాటు చైనా, జపానీస్, యూరోపియన్‌ పెయింటింగ్‌లతో కూడిన గ్యాలరీలు, అరుదైన కళాఖండాలు మ్యూజియంలో సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన సాలార్‌జంగ్‌ మ్యూజియంలో నిజాం నగల ప్రదర్శన కూడా జరిగింది. 

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మ్యూజియంలో బుద్దుడిపై ఫోటో ప్రదర్శన, మధ్యాహ్నాం 3.30 గంటలకు మాడర్న్‌ ఆర్ట్‌ గాలరీ ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని మ్యూజయం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ. నాగేందర్‌ రెడ్డి తెలిపారు.

హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియం....
2000 ఫిబ్రవరి 18 నుంచి పురానాహవేలీలో  హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియం కొనసాగుతోంది. నిజాం వంశ పాలకుడైన ఏడో నిజాం మీర్‌  ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911లో రాజ్యాధికారం చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన 1937లో తన పాతికేళ్ల పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో పాతికేళ్ల విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. నిజాం రజతోత్సవ వేడుకలలో దేశవిదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరై బహుమతులు అందజేశారు. వీటిలో ప్రతి బహుమతి ఎంతో విలువైంది. ఈ బహుమతులన్నింటినీ ఒక దగ్గర చేర్చి ప్రజల సందర్శనార్థం పురానీహవేళీలో నిజాం మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2000 ఫిబ్రవరి 18 నుంచి ఈ బహుమతులను ప్రదర్శనలో ఉంచారు.  మ్యూజియంలో నిజాం నవాబులు వాడిన ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి. బంగారంతో తయారు చేసిన సింహాసనం, వివిధ భవనాల నిర్మాణాల కోసం ఉపయోగించిన వెండి, బంగారంతో చేసిన గంపలు, తాపీలు, భవననిర్మాణానికి ఉపయోగించే వివిధ పరికరాలు, దేశంలోనే తొలిసారి చేతితో నడిపిన లిఫ్ట్, ఆరో నిజాం మీర్‌ వుహబూబ్‌ అలీఖాన్‌ చెక్కతో తయారు చేయించిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అల్మారా ఇక్కడ కొలువుదీరాయి.

చౌమహల్లా ప్యాలెస్‌
చౌమహల్లా ప్యాలెస్‌...
చార్మినార్‌కు అతి సమీపంలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌ యూరోపియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌదం. ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్‌)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్‌– ఉద్‌– దౌలా–బహదూర్‌ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్‌ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌లను నిర్మించారు. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌లో ఐదో నిజాం అఫ్తాబ్‌ మహల్, మఫ్తాబ్‌ మహల్, తహనియత్‌ మహల్, అప్జల్‌ మహల్‌ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్‌ మరింత శోభాయమానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గహంగా ఉండేది. ఆనాటి కాలంలో విద్యుత్‌ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్‌లో ఆతిథ్యమిచ్చేవారు. నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫోటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటినీ చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్‌ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్‌ కొనసాగుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement