
జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు :
పల్లెలను ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. మున్ముందు పల్లెల్లోనే ప్రతి సేవను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఇంటర్ నెట్ తప్పనిసరి. ప్రస్తుతం గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇదేక్రమంలో భగీరథ పైపులైన్‌తో పాటు ఇంటర్‌నెట్ సేవలను అందించడానికి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ)లైన్‌ను వేస్తున్నారు. తాగునీటి పైపులైన్ వేసిన తర్వాత ప్రత్యేకంగా ఆప్టిక్ ఫైబర్ లైన్ వేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే భగీరథ పనులతోపాటే ఫైబర్ లైన్‌ను వేస్తున్నారు.
డక్ట్‌తో గ్రామాల అనుసంధానం..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలను అనుసంధానం చేయడానికి 22,536.532 కి.మీ మేర పైపులైన్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. దీనిలో ఇప్పటి వరకు 20,520.506 కి.మీలకు నిర్మాణపరమైన అనుమతులు ఇవ్వగా 17,750.5428 కి.మీ డక్ట్ నిర్మాణం పూర్తి చేశారు. గ్రామాలను కలుపుతూ ఫ్రీ లాబ్రికేటేడ్ హైడెన్సీపాలిథిన్ (పీఎల్‌బీ హెచ్‌డీపీఈ)పైపులైన్ వేస్తున్నారు. గ్రామాల్లో అంతర్గతంగా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) పైపులైన్ వేస్తున్నారు. ప్రతి 500 మీటర్లకు ఒక చాంబర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పైపులైన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రత్యేక కేబుల్‌ను అమర్చుతారు.
కి.మీకి రూ.60వేల చొప్పున చెల్లింపు..
డక్ట్ నిర్మాణ పనులకు ప్రభుత్వం కిలోమీటర్‌కు రూ.60వేల చొప్పున చెల్లిస్తోంది. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకే ఈ బాధ్యతలను అప్పగించారు. పనుల పురోగతి ఆధారంగా ఏజెన్సీలకు డబ్బులను చెల్లిస్తున్నారు.
పల్లెకు ఐటీ వెలుగులు..
ప్రభుత్వం చేపట్టిన డక్ట్ నిర్మాణంతో 2018 వరకు పల్లెలకు ఐటీ వెలుగులు తలుపుతట్టే అవ కాశం ఉంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయ తీలు, ఆస్పత్రులు, బ్యాంకులు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయా లకు ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇవ్వను న్నారు. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇంటికి కూడా కనెక్షన్ తీసుకో వచ్చు. వీరి నుంచి నెలనెలా కొంత మొత్తం వసూలు చేస్తారు. అయితే ఇది నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక పాస్ వర్డ్‌తో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫోన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ఇది మరింత ఉపయోగపడనుంది. ఆన్‌లైన్ సేవలను మరింత జవాబుదారీతనంగా చేయడానికి వీలు కలుగుతుంది.