
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల జారీ వివాదాస్పదంగా మారింది. అడిగినంత ముట్టజెప్పితే చాలు డ్యూటీలకు రాకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై కొంతమంది విద్యార్థులు బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ పరిధిలోని వివిధ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న జూనియర్ వైద్యులతో పాటు చైనా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఉస్మానియాలో 200 మంది, గాంధీలో 200 మంది అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ చేస్తుంటారు.
ఉస్మానియాలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, క్యాజువాలిటీ విభాగాల్లో 200 మంది హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. వైద్య చికిత్సపై సమగ్ర అవగాహన కల్పించేందుకు రెండు నెలలు మెడిసిన్, రెండు నెలలు జనరల్ సర్జరీ, ఒక నెల పీడియాట్రిక్, 15 రోజులు ఈఎన్‌టీ, మరో పదిహేను రోజులు కంటి ఆస్పత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆయా విభాగాల్లో సీట్లు పొందిన అభ్యర్థుల్లో వంద మంది ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలో చదువుకున్న వారు ఉంటే మరో వంద మంది ఇతర కాలేజీల్లో చదువుకున్నవారుంటారు. అయితే వీరిపై సరైన నిఘా లేకపోవడంతో వీరిలో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. కానీ వారికి ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రిలో పని చేస్తున్న కొంత మంది క్లర్కులు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌ను వివరణ కోరగా సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆయా విభాగాధిపతుల నుంచి వివరణ కూడా కోరినట్లు నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment