రెడ్‌కార్నర్ నోటీసు రాజ్యాంగ విరుద్ధం
దాన్ని పరిగణనలోకి తీసుకోలేం: జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు
- కేవీపీకి హైకోర్టులో ఊరట
- ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తదుపరి చర్యలేవీ వద్దు
- సీఐడీ అదనపు డీజీకి హైకోర్టు ఆదేశం మధ్యంతర ఉత్తర్వులు జారీ
- పతివాదులకు నోటీసులు,తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: టైటానియం ఖనిజ తవ్వకాల వ్యవహా రంలో అమెరికాలో నమోదైన కేసుకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు కేవీపీరామచంద్రరావుపై ఇంటర్ జారీచేసిన పోల్ రెడ్ కార్నర్ నోటీసు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టు ఆక్షేపించింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించేందుకు కల్పించిన హక్కును కాల రాసేలా ఈ నోటీసు ఉందని స్పష్టంచేసింది. దీని ఆధారంగా తదుపరి ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీ అదనపు డీజీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సోమవారం మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఎప్పుడూ మనదేశ రాజ్యాంగ నిబంధనలకు, స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని భవేజ్ జయంతి లఖాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాక రెడ్ కార్నర్ నోటీసు అరెస్ట్ వారెంట్ కాదని, ఆ నోటీసుపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొందన్నారు.
ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ, ప్రస్తుత కేసులో జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు మన దేశ చట్టాలకు లోబడి లేదని, రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ రామ్మోహనరావు తన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. నోటీసు పంపే సమయంలో పాటించాల్సిన విధివిధానాలను కూడా పాటించలేదని, నోటీసుతో పాటు ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్ల ను జత చేయాల్సి ఉండగా, ఆ పని చేయలేదని, అందువల్ల ఆ నోటీసును ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోలేమని తేల్చి చెప్పారు.
ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. వీరితో పాటు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేశారు. కేసులో కేవీపీ తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణప్రసాద్, హోంశాఖ తరఫున జానకి రామిరెడ్డి వాదనలు వినిపించారు.