సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వ్యక్తమైన అనుమానాలపై ఈసీ దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం, బీఎల్‌ఎఫ్ డిమాండ్ చేశాయి. ఫలితాలపై బీఎల్‌ఎఫ్ అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపాయి. బుధవారం బీఎల్‌ఎఫ్ కార్యాలయంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడుతూ, కొన్ని స్థానాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులకు తాము వేసిన ఓట్లు వీవీప్యాట్‌లలో నమోదైనట్టు పలువురు ఓటర్లు తమ దృష్టికి తెచ్చారని, అయితే ఆయా బూత్‌లలో లెక్కింపు సందర్భంగా తమ అభ్యర్థులకు సున్నా ఓట్లు రావడంతో గోల్‌మాల్ జరిగిందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
ఈవీఎంలలో జరిగిన గందరగోళం కారణంగా రికార్డయిన ఓటింగ్‌కు ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చిన వివరాల్లో తేడాలున్నాయన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయమిస్తామని, అప్పటికీ వాటి అమల్లో విఫలమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్య, వైద్యం, సేద్యం విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎల్‌ఎఫ్‌ను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఎన్నికలు రావడంతో నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని తుదివరకూ తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించినట్టు పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లు తగ్గించొద్దు...
గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో తగ్గించడం సరికాదని తమ్మినేని అన్నారు. రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కూడా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తేనే ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ...
పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తామని బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీల జనాభాకు అనుగుణంగా 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment