
పంజాబ్‌కీ షాన్
సరిగ్గా 35 ఏళ్లు... చూడడానికి బక్కపలుచగా ఉన్నా ఆయన విజన్ చాలా బలీయమైనది.. తాను
ఎక్కడ పనిచేసినా తనదైన మార్కు ఉండాల్సిందే.. ‘దుగ్గల్ సాబ్ ఉన్నప్పుడు’ అని అందరూ
చెప్పుకోవాల్సిందే.. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో అంతర్జాతీయ అవార్డు కూడా సాధించారు.
చదివింది ఇంజినీరింగ్ అయినా పోలీస్ కావాలన్నదే జీవితలక్ష్యం.. పోలీస్ ఉద్యోగమే ఆశ,
శ్వాస.. పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన ఆయన దేశంలో ఎక్కడయినా పోలీస్‌గానే చేయాలని నిర్ణ
యించుకున్నారు.. తన తాత, తండ్రిని ఆదర్శంగా తీసుకుని వారి బాటలోనే పయనించాలను
కుని.. కచ్చితంగా పోలీసే కావాలన్న కలను నిజం చేసుకున్నారు జిల్లా పోలీస్‌బాస్ విక్రమ్‌జీత్
దుగ్గల్. ఆయన జీవిత విశేషాలపై సాక్షి అందిస్తున్న పత్యేక కథనం మీకోసం.
సాక్షిప్రతినిధి నల్లగొండ మాది పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ జిల్లా కోట్‌భాయ్ అనే గ్రామం. అయితే మా తాతల కాలంలోనే ఫాజిల్‌కా జిల్లా అబోహర్ అనే పట్టణానికి వచ్చి స్థిరపడ్డాం. ఈ పట్టణం పాకిస్తాన్ దేశ సరిహద్దులో ఉంటుంది. మన రాష్ట్రంలోని రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల సరిహద్దు కూడా. అక్కడే నా బాల్యమంతా గడిచింది. అబోహర్‌లోని అమృత్ మోడల్ హైస్కూల్‌లో చదివాను. ఇంటర్మీడియట్ కూడా అదే పట్టణంలోని డీఏవీ కళాశాలలో పూర్తి చేశాను. ఆ తర్వాత జలంధర్‌లోని పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో బీటె క్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) పూర్తి చేశాను. ఇంజనీరింగ్ 2002లో పూర్తయిన తర్వాత 2004లో సివిల్స్ పరీక్ష రాశాను.
పోలీస్ కేరాఫ్ దుగ్గల్ ఫ్యామిలీ
మా కుటుంబంలో పోలీసులుగా పనిచేయడం ఆనవాయితీగా వస్తోంది. మా తాత బాబూరామ్ దుగ్గల్, నాన్న కశ్మీరీలాల్ దుగ్గల్‌లిద్దరూ పోలీసులే. మాది వ్యవసాయ కుటుంబమే అయినా, మా తాత నేను వ్యవసాయం చేయను. పోలీసునవుతానని చెప్పి బ్రిటిష్ కాలంలో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1984లో ఆయన రిటైర్ అయ్యారు. ఆయనేమీ చదువుకోలేదు కూడా. మా నాన్న కశ్మీరీలాల్ కూడా కానిస్టేబులే. 1975లో పోలీసు విధుల్లో చేరిన ఆయన ఎస్‌ఐ హోదాలో 2007లో రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయిన సంవత్సరం బ్యాచ్ (2007 బ్యాచ్)లోనే నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. అంటే దాదాపు 60 ఏళ్లుగా మా కుటుంబం పోలీసు విధుల్లో ఉంది.
మా ఊరు యుద్ధభూమి
మా స్వగ్రామమైన ముక్త్‌సర్ జిల్లా యుద్ధభూమిగా పేరుగాంచింది. మొఘల్ సామ్రాజ్య కాలంలో ఇక్కడే మొఘల్ సైన్యానికి, సిక్కు సైనికులకు మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు 46 మంది సిక్కువీరులు అమరులయ్యారు. అందుకే ముక్త్‌సర్ అని పేరు వచ్చింది. ముక్త్ అంటే 46 అని పంజాబీలో అర్థం. అందుకే మా ఊరికి ఆ పేరు పెట్టారని అందరూ చెప్పుకుంటారు.
నా రోల్‌మోడల్..నా ప్రొఫెసర్
స్ఫూర్తినిచ్చే వారి గురించి చెప్పాలంటే రంగాల వారీగా చాలా మంది ఉంటారు. కానీ మీ రోల్‌మోడల్ ఎవరని అడిగితే మాత్రం మా ప్రొఫెసర్ బి.బి.శర్మ అని చెప్పక తప్పదు. నేను డీఏవీ కళాశాలలో చదివినప్పుడు ఆయన మాకు కెమిస్ట్రీ చెప్పేవారు. మాకు కెమిస్ట్రీ పాఠాలు చెప్పిన తీరు అద్భుతం. ఒకవేళ నేను టీచర్ అయి ఉంటే ఆయనలాగానే ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కూడా ఆయనలాగానే పరిపూర్ణంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఆయన నా రోల్‌మోడల్.
కమ్యూనిటీ పోలీసింగ్.. అవార్డు తెచ్చిపెట్టింది
నేను విశాఖపట్నం రూరల్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు గాను మా టీంకు అంతర్జాతీయ అవార్డు వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఓర్లాండో యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ (ఐఏసీపీ)లు సంయుక్తంగా ‘హోంల్యాండ్ సెక్యూరిటీ అవార్డు’ను ఇచ్చాయి. నాతో పాటు మా ఇన్‌స్పెక్టర్ కలిసి వెళ్లి అవార్డు స్వీకరించాం. అది చాలా సంతృప్తినిచ్చింది. విశాఖ రూరల్‌లో పనిచేస్తు న్నప్పుడే అన్ని రకాల ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి గ్రామపంచాయతీల వరకు జరిగిన ఈ ఎన్నికలను సమర్థంగా నిర్వహించగలిగామనే తృప్తి కలిగింది.
ఇంజినీర్‌ను కాదు సార్... పోలీస్..
నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుపై కొంత శ్రద్ధ తగ్గిపోయింది. అప్పుడు మా ప్రొఫెసర్ నన్ను ప్రశ్నించారు. ఎందుకు ఎలక్ట్రానిక్స్‌లో మంచి ప్రతిభ కనబర్చలేకపోతున్నావు అని. అప్పుడు ‘నేను ఇంజనీర్‌ను కావాలనుకోవడం లేదు సార్.. పోలీస్‌నవుతా.’ అని చెప్పాను. అయితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఇంకా గుర్తుంది. నువ్వు పోలీస్ కావాలన్నా శ్రద్ధతో చదవాలి... దీనిపై శ్రద్ధ తగ్గితే ఆ సబ్జెక్టులపై కూడా శ్రద్ధ తగ్గుతుంది. అలా కాకుండా చూసుకోవాలని చెప్పారు.