లైన్‌కట్టిన నకిలీగాళ్లు | Irregularities In Junior Lineman Selections In Adilabad | Sakshi
Sakshi News home page

లైన్‌కట్టిన నకిలీగాళ్లు

Published Fri, Jul 19 2019 10:05 AM | Last Updated on Fri, Jul 19 2019 10:05 AM

Irregularities In Junior Lineman Selections In Adilabad - Sakshi

మూడో విడత స్తంభం ఎక్కే పరీక్షలు గురువారం ఆదిలాబాద్‌ ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించారు. ఈ పరీక్షలో మరో నకిలీ అభ్యర్థి స్తంభం ఎక్కే ముందే అధికారులు పట్టుకున్నారు. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం న్యూలోలం గ్రామానికి చెందిన బొడ్డు సహేందర్‌ కోసం అదే గ్రామానికి చెందిన గురుపెల్లి విజయ్‌ స్తంభం పరీక్షలో పాల్గొనేందుకు వచ్చి దొరికిపోయాడు. ఈ బొడ్డు సహేందర్‌కు గురుపెల్లి విజయ్‌ దగ్గరి సంబంధీకుడు కావడం గమనార్హం. అయితే గురుపెల్లి విజయ్‌ న్యూలోలం గ్రామంలో ప్రైవేట్‌ ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తాడు. గ్రామంలో స్తంభాలు ఎక్కడం, దిగడం వంటి పనులు చేపట్టడం ద్వారా విద్యుత్‌శాఖతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇక్కడ తన బావమరిది కోసం స్తంభం ఎక్కేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు.

సాక్షి, ఆదిలాబాద్‌ : విద్యుత్‌శాఖలో జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల నియామక ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు ఈ రెండు కేసులు అద్దం పడుతున్నాయి. విద్యుత్‌శాఖతో సంబంధాలు ఉన్న వారే ఎ లాంటి భయం, సంకోచం లేకుండా స్తం భం ఎక్కే పరీక్షల్లో పాల్గొనేందుకు వస్తున్నా రు. వీడియో చిత్రీకరణ జరుగుతుందని తెలి సినా వెనుకంజ వేయకుండా వస్తున్నారంటేనే వారి వెనుక ఎవరో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎల్‌ఎం నియామకాల్లో భాగంగా మూడో విడత స్తంభం ఎక్కే పరీక్షలను గురువారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. వరంగల్‌ నుంచి వచ్చిన సీజీఎం పరిశీలకులుగా, ఆదిలాబాద్‌ ఎస్‌ఈ ఉత్తం జాడే సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఈ నియామకాలు జరుగుతున్నాయి. మొదటి కేసులో జాదవ్‌ శ్రావణ్‌కుమార్‌ను సెలక్షన్‌ కమిటీ పట్టుకున్నదిలేదు. అతనికి బదులు మరొక గుర్తు తెలియని వ్యక్తి స్తంభం ఎక్కే పరీక్షలో పాల్గొని వెళ్లిపోయిన తర్వాత మిగతా అభ్యర్థుల ఫిర్యాదుతో సెలక్షన్‌ కమిటీలో కదలిక వచ్చి పోలీసు ఫిర్యాదు చేశారు. ఇక్కడ సెలక్షన్‌ కమిటీ చేసిందేమిలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో సెలక్షన్‌ కమిటీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితిలో ఒక్క కేసైనా పట్టుకోవడం ద్వారా నకిలీలను ప్రోత్సహించమని చెప్పడానికి ఈ  ప్రయత్నం చేశారనే విమర్శలూ లేకపోలేదు.

మంచి డిమాండ్‌..
ఉమ్మడి జిల్లాలో 439 జేఎల్‌ఎం పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి మంచి డిమాండ్‌ ఉండడంతో విద్యుత్‌శాఖలోని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గతంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో జేఎల్‌ఎం పోస్టులను భర్తీ చేసినప్పటికీ ప్రస్తుతం రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేస్తుండటంతో పలువురు ఈ పోస్టులపై కన్నేశారు. కొత్తగా నియమితులయ్యే జూనియర్‌ లైన్‌మెన్‌కు అలవెన్సులతో కలుపుకొని రూ.31వేలకుపైగా జీతం ఉంది. బేసిక్‌ పే రూ.24వేలకుపైగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ కొలువు కావడం, మంచిజీతం ఉండడంతో విద్యుత్‌శాఖతో ఏదో రీతిన సంబంధం ఉన్నవారు దానిని సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు ఈ పోస్టును దక్కించుకునేందుకు అడ్డదారులకు దిగుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఓ అధికా>రి కొన్ని పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

సెలక్షన్‌ కమిటీపై ఆరోపణలు వ్యక్తం కావడంతో ఏదో ఒక కేసు చేసి తాము అంతా సవ్యంగా చేస్తున్నామని నిరూపించుకునే యత్నం చేశారన్న విమర్శలు లేకపోలేదు. గురువారం 88 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, 78 మంది హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. 9 మంది గైర్హాజరయ్యారు. ఒకరికి బదులు నకిలీ వ్యక్తి హాజరుకావడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తం జాడే ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయంలో సాక్షి వన్‌టౌన్‌ సీఐ సురేశ్‌ను వివరణ కోరగా విద్యుత్‌శాఖ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, దీంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement