నాగరాజు మృతదేహం
సాక్షి, సత్తుపల్లిటౌన్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి, గుండెపోటుతో మృతిచెందారు. వైరాకు చెందిన ఎదునూరి నాగరాజు(35), మధిరలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలక్షన్ డ్యూటీ పడింది. సత్తుపల్లిలోని జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటైన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. సత్తుపల్లి మండలం కిష్టారంలోని 199 పోలింగ్ స్టేషన్‌ను ఇతనికి అధికారులు కేటాయించారు. పోలింగ్ సామాగ్రి తీసుకున్న తరువాత, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉన్నదంటూ అక్కడే ఉన్న వైద్య శిబిరానికి వెళ్లారు.
ఆయనను డాక్టర్ చింతా కిరణ్‌కుమార్ పరీక్షించి, వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించి, హెల్త్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్ తోడుగా ద్విచక్ర వాహనంపై సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ ఆయనకు వెంటనే డాక్టర్ శివకృష్ణ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. గుండెపోటుగా నిర్థారించి వైద్యం చేస్తుండగదానే నాగరాజు కుప్పకూలిపోయారు, ప్రాణాలొదిలారు. ఆయనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భార్య కృష్ణవేణి, కుమార్తెలు వెన్నెల, మనన్వి ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబీకులకు సత్తుపల్లి తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్‌ఐలు విజయ్‌భాస్కర్, జగదీష్ అప్పగించారు.
పిల్లల్ని ఎండకు పంపొద్దని చెప్పి...
సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో భర్త నాగరాజు మృతదేహంపై పడి భార్య కృష్ణవేణి, తల్లి గుండెలవిసేలా రోదించారు. ‘‘పిల్లలను ఎండకు పంపించొద్దు. ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పి, డ్యూటీకి వెళ్లారు. ‘‘తాను తిరిగి రాలేననే... ఇన్ని జాగ్రత్తలు చెప్పారేమో’’నని ఆమె విలపిస్తుంటే... చూపరుల కళ్లల్లో తడి చేరింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం వైరాకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment