వ్యవస్థను ప్రశ్నిస్తూ పుస్తకం రాసిన ఐపీఎస్
బుధవారం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ‘ఈ వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో పోలీసు ఉద్యోగంలో చేరా. చేయలేకపోయినందుకు నేను ఫెయిల్యూర్’.. ‘ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థతో సామాన్యులకు ఒరిగేదేముంది? కొద్దిమంది కబంధ హస్తాల్లో అంతా బందీలం’.. ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా? కానేకాదు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు కో-ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్ సింగ్ (వీకే సింగ్) సంధించిన అక్షరాయుధం ‘ఈజ్ ఇట్ పోలీస్..? కన్ఫెషన్ ఆఫ్ ఎ టాప్ కాప్’ పేరుతో ఆంగ్లంలో రాసిన పుస్తకంలోని అంశాలు. గడిచిన రెండేళ్ల కాలంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ఈ పుస్తకం ప్రచురితమైంది. దీన్ని బుధవారం ఆవిష్కరించడానికి సన్నాహాలు పూర్తి చేశారు.
పోలీసుశాఖలో నిజాయితీపరులైన అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది? రాజకీయ నేతల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ ఎలా నిర్వీర్యమవుతోంది? తదితర అంశాలతో పాటు రాజకీయ వ్యవస్థకు పోలీసుశాఖ ఏ విధంగా జేబు సంస్థగా మారింది అనే వివాదాస్పద అంశాలనూ వీకే సింగ్ తన పుస్తకంలో చర్చించారు. దీని ప్రచురణకు అనుమతి కోరుతూ ఏడాదిన్నర కిందట ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా నిరాకరించడంతో బ్రేక్ పడింది. సర్కారు చేసిన సూచనల మేరకు మార్పులు చేశాక పది రోజుల కిందట ఢిల్లీలో అన్నా హజారే చేతుల మీదుగా ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లో, రానున్న రెండు నెలల్లో చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం రూపుదాల్చక ముందు నుంచే వివాదాస్పదం కావడంతో వీకే సింగ్ ఏడాది కాలంలో ఆంధ్రా రీజియన్ ఐజీ, తూనికలు కొలతలు విభాగం కంట్రోలర్, రాష్ట్ర ప్రత్యేక పోలీసు (ఏపీఎస్పీ)ల మీదుగా పోలీసు కో-ఆర్డినేషన్ విభాగానికి బదిలీపై వచ్చారు.
ఈజ్ ఇట్ పోలీస్?
Published Tue, Mar 18 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement