హత్యా.. ఆత్మహత్యా?
బ్యూటీషియన్ శిరీష మరణంపై అనుమానాలు
- ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించిన పోలీసులు
- పోస్టుమార్టం పరీక్షల్లో దేహంపై గాయాల గుర్తింపు
- కమిలిపోయిన కుడికన్ను, పెదవులు.. తల వెనుక భాగంలో గాయాలు.. దీంతో హత్య కోణంలో పోలీసుల విచారణ
- ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతిపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఆమెను హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చేపట్టిన దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య అన్న దిశగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించగా.. పోస్టుమార్టంలో మాత్రం ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రాజీవ్, శ్రవణ్‌లను గురువారం రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారించారు.
కుకునూర్‌పల్లి నుంచే మొదలైన ఘర్షణ!
స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని–శిరీష మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సోమవారం రాత్రి రాజీవ్, శ్రవణ్, శిరీషలు కుకునూర్‌పల్లి వెళ్లారు. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఆయన క్వార్టర్‌లోనే పంచాయితీ జరుగుతున్న సమయంలోనే ఘర్షణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. శిరీష–ప్రభాకర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగి తీవ్రస్థాయికి చేరుకుందని.. దాంతో వారిని వెళ్లిపోవాలంటూ ప్రభాకర్‌రెడ్డి పంపిచేశారని సమాచారం.
కారులో దాడి చేసిన రాజీవ్, శ్రవణ్
ఈ ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో కుకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ సమయంలోనే శిరీష తన భర్తకు వాట్సాప్ ద్వారా లొకేషన్‌ను షేర్ చేసింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో రాజీవ్, శిరీష మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నాడని తెలిసింది. ఓ దశలో శ్రవణ్ కూడా చేయి చేసుకున్నట్లు సమాచారం. దీంతో కారు దిగిపోవడానికి శిరీష రెండుసార్లు ప్రయత్నించగా వారు ఆపారు. కొంతసేపటికి పరిస్థితి చల్లబడింది. అనంతరం వారు నేరుగా ఆర్‌జే స్టూడియోకు వచ్చేశారు.
వాహనం తెచ్చుకుంటానని చెప్పి..
కుకునూర్‌పల్లి వెళ్లేముందు శిరీష తన వాహనాన్ని స్టూడియో వద్దే వదిలేసింది. తిరిగొచ్చాక తన వాహనాన్ని తెచ్చుకుంటానంటూ స్టూడియోలోకి వెళ్లింది. మరోవైపు శ్రవణ్ తన స్వస్థలమైన మాల్‌కు వెళ్లాల్సి ఉండటంతో.. రాజీవ్ బస్టాండ్ వరకు క్యాబ్ బుక్ చేసిన అతడిని పంపేశాడు. అప్పటికే శిరీష స్టూడియోలోకి వెళ్లి పది నిమిషాలు కావడం, లోపల లైటు వెలుగుతుండటంతో కొద్దిసేపు బయటే ఎదురుచూశానని రాజీవ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. శిరీష తిరిగి రాకపోవడంతో పైకి వెళ్లిచూడగా.. అప్పటికే చున్నీతో ఉరి వేసుకుని కనిపించిందని... ఆమెను కిందకు దింపి పోలీసులకు సమాచారమిచ్చానని చెప్పినట్లు సమాచారం.
శిరీష దేహంపై గాయాలు
శిరీష మృతదేహానికి మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయగా.. ఫోరెన్సిక్ వైద్యులు గురువారం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. శిరీష శరీరంపై గాయాలు ఉన్నాయని.. మెడపై ఒత్తిడి పడడంతో ఊపిరాడక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుడి కన్ను కమిలిపోయి ఉండటంతో పాటు రెండు పెదవులపైనా గాయాలు ఉన్నాయని, తల వెనుకభాగంలోనూ గాయాలున్నాయని వెల్లడించినట్లు సమాచారం. దీంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజీవ్, శ్రవణ్‌లను గురువారం రాత్రి స్టూడియోకు తీసుకువెళ్లి పలు కోణాల్లో విచారించారు.
ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ పరిశీలన
ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ బృందం శిరీష మృతిచెందిన స్థలాన్ని గురువారం పరిశీలించి ఆధారాలు సేకరించింది. పోలీసుల అదుపులో ఉన్న రాజీవ్, శ్రవణ్ చెప్పిన వివరాలకు ఇక్కడ సేకరించిన ఆధారాలకు ఎంతవరకు లింకు ఏర్పడుతోందన్న దిశగా పోలీసులు ఆరా తీశారు. 13వ తేదీ తెల్లవారుజామున స్టుడియోకు వచ్చిన శిరీష.. 3.45 గంటల సమయంలో గదిలోకి వెళ్లినట్టు బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించారు. పాదముద్రల ఆధారంగా ఆమె నడుచుకుంటూ వెళ్లిందని, అంటే గదిలోకి వెళ్లేముందు శిరీష ప్రాణాలతోనే ఉందని తేల్చారు. ఇక 3.55 గంటలకు రాజీవ్ బయోమెట్రిక్ ప్రెస్ చేయగా తెరుచుకోకపోవడంతో.. కిందకు వెళ్లి పది నిమిషాల తర్వాత వచ్చినట్టు భావిస్తున్నారు. ఇక అపార్ట్‌మెంట్లో సీసీ కెమెరాలు చాలా రోజులుగా పనిచేయడం లేదని వెల్లడైంది.
శిరీష ఘటనతో లింకుపై దర్యాప్తు
– కుకునూర్‌పల్లికి రాజీవ్, శ్రవణ్, తేజస్విని!
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష మృతి ఘటనకు లింకుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సై ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచీ జరిగిన పరిణామాలపై దృష్టి కేంద్రీకరించారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శిరీష ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినిలను కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువచ్చి విచారించినట్లు తెలిసింది. ఎస్సై క్వార్టర్‌లో 12వ తేదీ రాత్రి ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.