'చెరు'వు | istrict has been the occupation of the pond Shikha | Sakshi
Sakshi News home page

'చెరు'వు

Published Mon, Jul 21 2014 1:07 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

'చెరు'వు - Sakshi

'చెరు'వు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో చెరువు శిఖాలు ఆక్రమణకు గురయ్యాయి. పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాక అధికారులు స్పందించినా ఫలితం లేకుండా పోతోంది. నల్లగొండ పట్టణ సమీపంలోని చెరువుల శిఖం భూములలో నిర్మాణాలు చేపట్టగా అధికారులు కూల్చివేశారు. అదే విధంగా చౌటుప్పల్, కోదాడ పట్టణాల్లో రియల్ ఎస్టేల్ వ్యాపారులు చెరువుల శిఖం భూములను ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి చెరువు శిఖం భూమిలో నుంచి రోడ్డు వేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే జరిపి హద్దు రాళ్లను సైతం పాతారు. నల్లగొండ నియోజకవర్గంలో 41 పెద్ద చెరువులు, 160 కుంటలు ఉన్నాయి. వాటిలో పెద్ద చెరువుల శిఖం భూములు సైతం ఆక్రమణకు గురయ్యాయి. నల్లగొండ మండలంలోని చర్లపల్లి, ఉర్రకుంట, ఆర్జాలబావి, కతాల్‌గూడెం సమీపంలోని చెరువు శిఖం భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు సైతం చేశారు. అధికారులు వాటిని కూల్చి వేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అదే విధంగా తిప్పర్తి మండలంలోని ఇందుగుల చెరువు శిఖం 135 ఎకరాలు ఉండగా సుమారు 60 ఎకరాలను ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు.
 
 చెర్వుపల్లి చెరువు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సుమారు 150 ఎకరాల శిఖం భూమిని ఆక్రమించుకున్నారు. కనగల్ మండలం జి.ఎడవెల్లి చెరువు సుమారుగా 70 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అమ్మగూడెం చెరువులో 15 ఎకరాలు, తిమ్మాజిగూడెం చెరువు 10 ఎకరాలు ఆక్రమణకు గురైంది. చెరువుల ఆక్రమణ వల్ల వర్షాకాలంలో వర్షపు నీరు నిలవక పోవడంతో చెరువుల కింద సాగు రోజు రోజుకూ తగ్గిపోతోంది.    భువనగిరి నియోజకవర్గంలోని పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భువనగిరిలోని పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు, రియల్ వెంచర్లు వెలిశాయి. బీబీనగర్ పెద్ద చెరువు, వెంకిర్యాల చెరువు, పడమటిసోమారం, జైనపల్లిచెరువులు, వలిగొండ మండలం అక్కా చెల్లెళ్ల చెరువు, ఏదుల్లగూడెం కుంట,అరూర్ మద్దులగండిచెరువు, వలిగొండ పెద్ద చెరువు, వలిగొండబాపన్ చెరువు, భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి చెరువుల శిఖంను ఆక్రమించుకున్నారు.
 
     ఆలేరు నియోజకవర్గంలో పలు చెరువులు కుంటలు ఆక్రమణకు గురయ్యాయి. ఆలేరు మండలం రాఘవాపురం కాశిబుగ్గ చెరువు, కొలనుపాక పిన్నచెరువు,అప్పలయ చెరువు, మందనపల్లి మైసమ్మ చెరువు, కొల్లూరు నల్లచెరువు, ఇక్కుర్తి చెరువు, యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లి నల్ల చెరువు, మల్లాపురం గండిచెరువు, యాదగిరిపల్లి ఊరకుంట, తుర్కపల్లి మండలం ముల్కల చెరువు,తుర్కపల్లి బూర్గుకుంట, బొమ్మలరామారం మండల కేంద్రంలోని నల్లచెరువు, పెద్దపర్వతాపురం,నాగినేనిపల్లి, మేడిపల్లి ఆత్మకూర్ (ఎం) కేంద్రంలోని బక్కమల్లయ్యకుంటల శిఖం భూములను ఆక్రమించుకున్నారు.
 
     దేవరకొండ నియోజకవర్గం పరిధిలో కుంటలు, చెరువుల శిఖం భూములు వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. దేవరకొండ మండలంలోని కొండమల్లేపల్లి బస్టాండ్ సమీపంలో గల నల్లకుంట శిఖం భూమి పది ఎకరాలు, చింతపల్లి మండలంలోని ఉమ్మంతాలపల్లిలో ధోబికుంట రెండు ఎకరాలు, పీఏపల్లి మండలంలో చిల్కమర్రి ఊరచెరువు 4 ఎకరాలు, ఘణపురం నల్లకుంట 7 ఎకరాల శిఖం భూములు చుట్టు పక్కల రైతులు ఆక్రమించారు. అదే విధంగా దేవరకొండ పట్టణంలోని సర్వే నంబర్ 729లో 5.39 ఎకరాలున్న తుల్చమ్మకుంట (సుల్తాన్‌చెరువు)లో సుమారు రెండు ఎకరాలు, చింతపల్లి పట్టణ కేంద్రంలోని 200 ఎకరాల చిన్నచెరువులోరియల్ ఎస్టేట్ వ్యాపారులు సుమారు 15 ఎకరాలు ఆకమించుకున్నారు. డిండి ప్రాజెక్టు ఆయకట్టు భూమి ఐబీశాఖ పరిధిలో ఉండగా చాలా మేరకు ఆక్రమణకు గురయ్యింది.
 
     కోదాడ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 172 చెరువులు,17 కుంటలు ఉన్నాయి. వీటిలో కోదాడ పెద్దచెరువు, వాయిల సింగారం, బేతవోలు, మాధవరం, జేపిగూడెం, మాధవరం చెరువులు చెప్పుకోదగ్గవి. మొత్తం చెరువుల్లో 14 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. కోదాడ పెద్దచెరువులో కోట్ల రూపాయల విలువ చేసే దాదాపు 300 ఎకరాల శిఖం ఆక్రమణకు గురయ్యింది. కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో గల సాగి చెరువు, కోదాడలోని ఎర్రకుంట, మునగాల మండలం ఆకుపాముల కామునిగుంట, నాగులచెరువులు పూర్తిగా మాయమయ్యాయి. చిలుకూరు మండలంలో సుమారు 40 కోట్ల విలువైన 400 ఎకరాల చెరువు శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. మునగాల మండలం గణపవరం ఊర చెరువులో సుమారు70ఎకరాలు, మునగాల ఊరచెరువులో సుమారు 50ఎకరాలు, నడిగూడెం మండలంలో 10 చెరువుల్లో సుమారు 200 ఎకరాల చెరువు శిఖం ఆక్రమణకు గురయ్యింది.
 
     మిర్యాలగూడ నియోజకవర్గంలో మొత్తం 47 చెరువులు, 77 కుంటలు ఉన్నాయి. మిర్యాలగూడ మండలంలో 17 చెరువులు, 54 కుంటలు 2543 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సుమారు 239 ఎకరాల శిఖం భూమి ఆక్రమణకు గురైంది. వాటర్‌ట్యాంకుతండా గ్రామపరిధిలోని 67 ఎకరాల మైసమ్మకుంట పూర్తిగా ఆక్రమణకు గురైంది. వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెంలో 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంట, కుక్కడం గ్రామపంచాయతీ పరిధిలోని  65 ఎకరాల కుందోనికుంట, శెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని 62 ఎకరాలలో ఉన్న ముండ్లపాడుకుంటలు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. అదే విధంగా దామరచర్ల మండలంలో రాజగట్టుకుంట 10 ఎకరాలు, ఇర్కిగూడెం కుంట 66 ఎకరాలు, తిమ్మాపురం కుంట 10 ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి.
 
     సూర్యాపేట మండలంలోని బాలెంల బోలేబండ చెరువు, బయ్యన్నచెరువు, పిల్లలమర్రి, రామారం, కే.టీ అన్నారం, యండ్లపల్లి, వెంకటాపురం, టేకుమట్ల, రాయినిగూడెం, యర్కారం చెరువుల శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. పెన్‌పహాడ్ మండలంలోని లింగాల గ్రామంలోని ఊరు చెరువు 15ఎకరాలను చుట్టు పక్కల రైతులు ఆక్రమించుకుని శిఖం భూమిలోనే బావి తీసి పంటలు సాగు చేసుకుంటున్నారు. అదే విధంగా అనంతారం మైల సముద్రం చెరువు సుమారు 50ఎకరాలు ఆక్రమణకు గురికాగా చీదెళ్ల గ్రామంలోని పెద్ద చెరువులో కొంత మంది రైతులు ఏకంగా బోర్లు వేసుకుని చెరువులోనే పంటలు సాగు చేస్తున్నారు. చివ్వెంల మండలంలో వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులోని 210 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులో సుమారు 30 ఎకరాలు, దేవి చెరువు 98 ఎకరాలు ఉండగా 20 ఎకరాలు, వల్లభాపురం గ్రామ ఆవాసం ఉండ్రుగొండ ఊర చేరువు 36 ఎకరాలు ఉండగా 10 ఎకరాలు , అక్కల దేవి గూడెం చెరువు 10 ఎకరాలతో పాటు తిమ్మాపురం, గుంజలూరు, దురాజ్‌పల్లి చెరువులను ఆక్రమించుకున్నారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఆత్మకూర్.ఎస్‌లో పెద్ద చెరువు, మర్రికుంట, నెమ్మికల్‌లోని పెద్ద చెర్వు, తుమ్మలపెన్‌పహాడ్‌లోని బోసికుంట, ఏపూరు పెద్ద చెరువులు ఆక్రమించారు.    తుంగతుర్తి నియోజకవర్గంలో 76 చెరువులు, 180 కుంటలు ఉన్నాయి. చెరువులు, కుంటల్లో చాలాచోట్ల శిఖం భూములు రైతులు ఆక్రమించారు. నూతనకల్‌లో చౌట చెరువును ఆక్రమించడంతో కొంత మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల అధికారులు సర్వే నిర్వహించారు.  
 
 నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సుమారు 365 ఎకరాల చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. త్రిపురారం మండలంలోని బెజ్జికల్‌లో పడమటి చెరువు 34 ఎకరాలు, తూర్పు చెరువు 38 ఎకరాలు, పల్గుతండాలోని సత్తేమకుంటలో 2.10 ఎకరాలు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. 30.23 ఎకరాలు ఉన్న త్రిపురారం చెరువు  20 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. నిడమనూరు మండలంలో సోమవారిగూడెం చెరువు, రేగులగడ్డ, తుమ్మడం పెద్దచెరువు, చిన్న చెరువు, గుంటిపల్లి, ఊట్కూర్ గ్రామాల్లో సుమారు 240 ఎకరాల భూమి ఆక్రమించారు. హాలియా మండలం రాజవరం, పేరూరు గ్రామాల్లోని సుమారు 25 ఎకరాల చెరువుల భూములు ఆక్రమణకు గురయ్యాయి.
 
 నకిరేకల్ నియోజకవర్గంలో 83 చెరువులు, 211కుంటలున్నాయి. కాగా నియోజకవర్గ వ్యాప్తంగా 28 చెరువులు, కుంటల పరిధిలోని 200 ఎకరాల్లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. నకిరేకల్ మండలంలోని ఎర్ర కుంటసగం కనుమరుగైంది. జాతీయ రహదారి పక్కన ఉన్న  నల్లచెరువు 50 ఎకరాలకు గాను సూమారు 10 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా చందుపట్ల, తాటికల్, మంగళపల్లి, నోముల తదితర గ్రామాల్లో చెరువులు, కుంటల శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. కట్టంగూరు మండలంలో 8 చెరువులు, 10 కుంటల్లో సుమారు 50 ఎకరాల శిఖం భూములు ఆక్రమించుకున్నారు. నార్కట్‌పల్లి మండలంలో నార్కట్‌పల్లి, చెర్వుగట్టు చెరువుల్లో 2 ఎకరాల చొప్పున ఇటీవల ఆక్రమణలకు గురికాగా వాటిని తిరిగి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట మండలకేంద్రంలోగల లోతుకుంట ఆక్రమణల వల్ల పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయింది.
 
     చౌటుప్పల్‌లోని నాగులకుంటలో ఆక్రమణదారులు రోజుకో నిర్మాణాన్ని చేపడుతున్నారు. సర్వేనంబరు 322లో 11.32ఎకరాల్లో నాగులకుంట విస్తరించి ఉండగా 6ఎకరాలకు పైగా భూమి కబ్జాలకు గురైంది. తాళ్లసింగారంలోని కుంట శిఖం 3ఎకరాలకు పైగా, జైకేసారంలో 15ఎకరాలకు పైగా ఆక్రమణదారుల పాలయ్యింది. మునుగోడులో మునుగోడు పెద్దచెరువు 600ఎకరాల్లో విస్తరించి ఉండగా, చుట్టుపక్కల రైతులు 70ఎకరాలకుపైగా ఆక్రమించుకుని సుమారు 40బోర్లు వేశారు. కొంపెల్లి చెరువులో 30ఎకరాలకు పైగా, వెల్మకన్నె చెరువులో 17ఎకరాలకుపైగా కబ్జా చేశారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న మాసన్న కుంట పూర్తిగా ఆక్రమణకు గురైంది.
 
     హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సుమారు 800 ఎకరాల చెరువు, కుంటల శిఖం భూములు ఆక్రమణదారుల చే తుల్లో కబ్జాకు గురయ్యాయి. చెరువు కుంటల శిఖంభూములను ఆక్రమించి మట్టితో నింపివేసి దర్జాగా ఆక్రమణదారులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే కబ్జాకు గురైన చెరువుల శిఖం భూముల విలువ సుమారు రూ. 90 కోట్ల విలువ చేయనున్నాయి. రాబోయే రోజుల్లో చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement