కళ్లెం శివ మృతదేహం
మామునూరు (వరంగల్) : వేసవి సెలవులకు పెద్దమ్మ ఇంటికి వచ్చిన ఓ విద్యార్థి మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధి గుంటూరుపల్లి గ్రామ చెరువులో శనివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన కళ్లెం వెంకటేశం, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు శివ(18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి వేసవి సెలవుల కావడంతో తల్లి, శివ కలిసి మామునూరు సమీపంలోని గుంటూరుపల్లి గ్రామం బుడిగెజంగాల కాలనీ పత్రి సమ్మయ్య, చంద్రమ్మ దంపతుల ఇంటికి వచ్చారు.
శివ కాలనీలోని విద్యార్థులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు శనివారం మధ్యాహ్నం చెరువుకు వెళ్లాడు. చెరువులో దిగిన తర్వాత ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. తోటి వారు గమనించి బయటకు వచ్చి గ్రామస్తులను పిలిచేలోపు మునిగి మృతిచెందాడు. బంధువులు, పోలీసులు చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీ తరలించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు, మృతుడు తల్లి శోకసంద్రంలో మునిగారు.
దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఇప్పుడు కొడుకు దూరమవడంతో తల్లి కన్నీరు మున్నీరై రోదించింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment