శిఖం..ఖతం | ponds and kuntas are occupied by land grabbers | Sakshi
Sakshi News home page

శిఖం..ఖతం

Published Wed, Mar 7 2018 10:42 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

ponds and kuntas are occupied by land grabbers - Sakshi

మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి చిన్న చెరువు వద్ద ఆక్రమణ భూమిని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ (ఫైల్‌)

మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు, మైసమ్మకుంటతో పాటు మండలంలోని యాద్గార్‌పల్లి చిన్న చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని కుంటలు ఆనవాళ్లు కూడా కోల్పోయాయి. చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మిర్యాలగూడ పట్టణ సమీపంలోని విలువైన భూములతో పాటు వేములపల్లి మండలంలో కూడా విలువైన చెరువు శిఖం భూములను స్వాహా చేశారు. మిషన్‌ కాకతీయ పథకంతో కొన్ని కుంటలకు నిధులు కేటాయించారు. కానీ ఆయా కుంటలు ప్రస్తుతంఆనవాళ్లు లేకుండా పోవడంతో ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. 

ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు ఇవీ:
-   మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామంలో చిన్న చెరువు 16 ఎకరాలు ఉండగా ఆక్రమణకు గురై పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. కొంతమంది ఆక్రమించుకొని వ్యవసాయ భూమిగా ఉపయోగిస్తుండగా, మరికొంత మంది రోడ్డు వెంట నిర్మాణాలు చేపట్టారు.
-  మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడులో ఉన్న ఊరకుంట సర్వే నంబర్‌ 19లో 9 ఎకరాలలో ఉండగా, అది ప్రస్తుతం కనిపించకుండా పోయింది.
-  మిర్యాలగూడ పట్టణ సమీపంలోని వాటర్‌ట్యాంకుతండా పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 36లో ఉన్న మైసనమ్మకుంట 55 ఎకరాల విస్వీర్ణంలో ఉండగా పూర్తిగా ఆక్రమణదారుల చేతిలో ఉంది.
-  వేములపల్లి మండలం కేంద్రంలోని నియామత్‌ఖాన్‌ చెరువు సర్వేనంబర్‌ 643లో 221.37 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సి ఉండగా 40 ఎకరాల శిఖ భూమిని ఆక్రమించారు. 
-   వేములపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 30లో చిన్న చెరువు 354.24 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సి ఉండగా, 25 ఎకరాల శిఖం భూమి ఆక్రమణకు గురైంది.
-  వేములపల్లి మండలం శెట్టిపాలెంలోని రెండు కుంటలు 47 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా పూర్తిగా ఆక్రమణకు గురికావడం వల్ల ఆనవాళ్లు కూడా కోల్పోయాయి. 
-  వేములపల్లి మండలం రావులపెంటలోని సర్వేనంబర్‌ 14లో ఉన్న చెరువు 180 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సి ఉండగా 10 ఎకరాల శిఖం ఆక్రమణకు గురైంది.
రూ.52.20 కోట్ల విలువైన భూములు

మిర్యాలగూడ నియోజకవర్గంలో 52.20 కోట్ల రూపాయల విలువైన చెరువుల భూములు కబ్జాలకు గురయ్యాయి. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో చిన్న చెరువు, నందిపాడులోని కుంట భూమికి, మైసనమ్మకుంట భూములకు ఎకరానికి 50 లక్షల రూపాయల విలువ ఉంది. కాగా ఆయా చెరువుల పరిధిలో ఆనవాళ్లు కోల్పోయిన 40 కోట్ల విలువైన 80 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు భావిస్తున్నారు. అదే విధంగా వేములపల్లి మండలంలో సుమారు 12.20 కోట్ల విలువైన 122 ఎకరాల శిఖం భూములతో పాటు కుంటలు కాజేశారు. 

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
చెరువుల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలోని 47 ఎకరాల విస్తీర్ణంలో రెండు కుంటలకు గాను మిషన్‌ కాకతీయ పనులకు గాను 88 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కాగా కుంటలు పూర్తిగా ఆక్రమణదారుల చెరలో ఉండటం వల్ల సమీపంలోని రైతులు కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అదే విధంగా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి చిన్న చెరువు ఆక్రమణ గురించి స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా పరిశీలించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు
చెరువులకు ఫుల్‌ ట్యాంక్‌ రిజర్వాయర్‌ మేరకు హద్దు రాళ్లు వేశాం. వేములపల్లి మండలంలోని నియామత్‌ఖాన్‌ చెరువు ఆక్రమణదారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అదే విధంగా యాద్గార్‌పల్లిలోని చెన్ని చెరువుపై ఉన్నతాధికారులు నివేదికలు అందజేశాం.  ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు చెరువుల ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.  
– మురళి, డీఈ, మిర్యాలగూడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement