ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవనుందని తెలంగాణరాష్ట్ర సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ హబ్‌ను గచ్చిబౌలితో పాటు మహేశ్వరం, పోచారం వరకూ విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను వైఫై నగరంగా అభివృద్ధి చేసేందుకు పలు 4జీ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల క్లస్టర్లను నెలకొల్పేందుకు అనుగుణంగా ఐటీఐఆర్ ప్రాజెక్టులో ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రి అధికారులకు సూచించారు.