సాక్షి, హైదరాబాద్: జీఈఎస్ సదస్సుకు హాజరైన విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పసందైన విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సదస్సుకు వచ్చిన అమెరికన్ డెలిగేట్లు, రతన్ టాటా, ముఖేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఆది గోద్రెజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. 8.44 గంటల సమయంలో మోదీ రాగా.. ఆయనకు సాదర స్వాగతం పలికారు. 8.53 గంటల సమయంలో ఇవాంకా ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. అంతకుముందే 33 బస్సుల్లో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు విందు ప్రాంగణానికి చేరుకున్నారు. విందు షెడ్యూల్ ముందు నిర్ణయించిన దానికంటే దాదాపు గంట ఆలస్యమైంది.
రాచ మర్యాదలతో స్వాగతం
ఫలక్‌నుమా ప్యాలెస్ విందులో పాల్గొనేందుకు ఇవాంకా తాను బస చేసిన ట్రైడెంట్ హోటల్ నుంచి రాత్రి 8.10 గంటల సమయంలో బయలుదేరారు. ప్యాలెస్ వద్ద ఆమెకు రాచ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ప్రధాన గేటు వద్దే ఆమెకు గులాబీపూల గుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ప్యాలెస్ లోపల ప్రధాన భవనం వరకు తీసుకెళ్లారు. ఇతర ప్రముఖుల వాహనాలను కూడా ప్రధాన గేటు వద్దే నిలిపేసి.. గుర్రపు బగ్గీలు, ఎలక్ట్రిక్ కార్లలో లోనికి తీసుకెళ్లారు. 101 మంది ఒకేసారి కూర్చుని తినగలిగే భారీ డైనింగ్ టేబుల్‌పై ఆమెకు విందు ఇచ్చారు. ప్రధాని మోదీ, ఇవాంకా, కేసీఆర్, కేటీఆర్, పలువురు జీఈఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. విందులో ఆమెకు భారతీయ, హైదరాబాదీ ప్రత్యేక వంటకాలను వడ్డించారు. ముఖ్యంగా కుంకుమ పువ్వు మేళవించిన వంటకాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. హైదరాబాదీ బిర్యానీ రుచి చూస్తానని ఆమె ఇంతకు ముందే పేర్కొన్నారు కూడా. ఇక విందు అనంతరం ఇవాంకా కొంతసేపు ప్యాలెస్‌లో గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గతంలో నిజాం నవాబు ఉపయోగించిన నిజాం సూట్‌ను ఆమెకు కేటాయించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తాజ్ గ్రూప్ లగ్జరీ హోటల్‌గా మార్చిన తరువాత విచ్చేసిన తొలి హైప్రొఫైల్ విదేశీ అతిథి ఇవాంకాయే. ఇక విందులో తెలుగు రాష్ట్రాల నుంచి శోభా కామినేని, ప్రతాప్ సి రెడ్డి, బీవీ మోహన్‌రెడ్డి, ఉపాసన, సంజయ్‌బారు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాదీ వంటకాలు స్పెషల్..
ప్యాలెస్‌లోని చారిత్రాక డిన్నర్ టేబుల్‌పై భారతీయ, హైదరాబాదీ ప్రత్యేక వంటకాలను వడ్డించారు. హలీం, బిర్యానీ, షీర్ కబాబ్, మటన్ మరగ్, నాన్ రోటీ, పరోటా, రుమాలీ రోటీ, మటన్ కోఫ్తా, గ్రిల్డ్, మొఘలాయి చికెన్, ఘోస్ట్ షికపురీ కబాబ్, దహీ కే కబాబ్, ముర్గ్ పిస్తా కా సలాన్, సితాఫల్ కుల్ఫీ, అఘజ్ సూప్, వాక్ఫా, మెజ్ బన్, మహ్‌గూల్ దస్తర్ క్వాన్, గులాబ్ జామ్, ఖుబానీకా మీఠా, కద్దుకీ ఖీర్, డ్రైఫ్రూట్స్ ఖీర్ తదితర వెరైటీలను అతి థులకు వడ్డించారు. ఒక్కో అతిథికి ఒక్కొక్క సర్వర్ ద్వారా వడ్డించారు. ఫలక్‌నుమలో విందు అనంతరం రాత్రి 10.47 గంటలకు మోదీ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని రాజ్‌కోట్‌కు వెళ్లారు. ఇవాంక రాత్రి 10.45 గంటలకు బయల్దేరి తాను బస చేస్తున్న ట్రైడెంట్‌కు వెళ్లారు.
రావమ్మా.. ఇవాంకా!
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్ ద్వారా 3.14 గంటలకు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్‌ఐసీసీ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment