కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
సూర్యాపేట: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కొద్దిరోజులుగా నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్న పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. స్వతహాగా న్యాయవాదైన జగదీశ్‌రెడ్డి.. సూర్యాపేటలో సొంతంగా కేసు దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల 21 నుంచి పొన్నం ప్రభాకర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని తెలిపారు. ఈ విషయమై ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదన్నారు. పైగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్‌పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద చర్యలు తీసుకోవాలని ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేసును స్వీకరించిన న్యాయస్థానం పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వులు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపినట్టు ఆయన తెలిపారు.