జై భవానీ.. జైజై భవానీ | Jai Bhavani .. Jai Jai Bhavani | Sakshi
Sakshi News home page

జై భవానీ.. జైజై భవానీ

Published Thu, Sep 25 2014 1:44 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

Jai Bhavani .. Jai Jai Bhavani

ఆదిలాబాద్ కల్చరల్ : దుర్గాదేవీ శరన్నవరాత్రోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి విగ్రహాలను మండపాల్లో నెలకొల్పి భక్తులు తొమ్మిది రోజుల పాటు శక్తిశ్రద్ధలతో పూజలందించనున్నారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపం (అవతారం)లో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 ముస్తాబైన ఆలయాలు..  మండపాలు..
 దుర్గానవరాత్రోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో జిల్లా కేంద్రంలోని పలు వాడల్లో దేవీ ఆలయాలు ముస్తాబయ్యాయి. రేణుకామాత, దుర్గామాత, కాళికామాత, కన్యకా పరమేశ్వరీదేవీ తదితర ఆలయాలు ముస్తాబయ్యాయి. వాడవాడలా దుర్గాదేవీ ప్రతిమలను ప్రతిష్టించేందుకు వివిధ సంఘాలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో మండపాలు, ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగ్‌లు రూపొందించారు. అమ్మవారి ప్రతిమలను మండపాల్లో నెలకొల్పారు.

 ప్రత్యేక పూజలు..
 అఖండ దీపారాధన, కుంకుమపూజ, చండీహోమం తదితర పూజలు నవహ్నిక దుర్గోత్సవాల ప్రత్యేకం. ఈ సారి దుర్గామాత ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు మాత్రమే పూజలందుకోనున్నారు. నవరాత్రుల్లో నవమి ప్రాంతంలో దశమి రావడంతో ఉత్సవాలను నవహ్నిక పురస్కార దుర్గోత్సవాలుగా జరుపుకోనున్నారు.

 తొమ్మిది రూపాల్లో అమ్మవారు.. బాలాత్రిపుర సుందరీ..
 అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమిస్తూ భక్తులకు అభయ హస్తమిస్తుంది. త్రిపుర త్రయంలో ఈ దేవీ మొదటిది. బాలదేవీ మహిమాన్వితమైంది. శ్రీ బాలమంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది. అందుకే ముందుగా ఈ దేవీని పూజిస్తేనే మహాత్రిపుర సుందరిదేవీ అనుగ్రహాన్ని పొందగలం.

 గాయత్రీ..
 గాయత్రీమాత సకల మంత్రాలకు మూలమైన శక్తిగా.. వేద మాతగా ప్రసిద్ధి పొందింది. గాయత్రి మంత్రం ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వెయ్యి సార్లు ధ్యానిస్తే గాయత్రీదేవీ అనుగ్రహిస్తుందని పండితులు చెబుతారు. గాయత్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది.

 అన్నపూర్ణ..
 అన్నం పరబ్రహ్మ స్వరూపం.. సర్వజీవనాధారం.. అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణే. నిత్యాన్నదానేశ్వరీగా సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా జీవకోటి నశించకుండా కాపాడుతుంది. దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలి తీరుస్తుంది. అది దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కార్యం. అమ్మవారిని కొలిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని అందరి నమ్మకం.
 
మహాలక్ష్మీ..
 మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవీ. ప్రతీఒక్కరి జీవితం లక్ష్మీ కటాక్షంపైనే ఆధారపడి ఉంటుంది. ధనం లేకపోతే బతుకు ఎంత దుర్భరమో చెప్పనక్కర్లేదు. అందుకే అంతా లక్ష్మీ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రెండు చేతుల్లో కమలాలను ధరించి, వరదాభయహస్తాలను ప్రదర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసనాసీనురాలిగా మహాలక్ష్మీదేవీ దర్శనమిస్తుంది.
 
సరస్వతీ..
 చదువులతల్లి సరస్వతీదేవీ. ఈ తల్లి సకల విద్యలను ప్రసాదించి, జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున విద్యార్థులు సరస్వతీదేవీని భక్తితో కొలిస్తే అన్నింటా విజయం లభిస్తుందని ఒక నమ్మకం. సరస్వతీదేవీ ధవళ వస్త్రాన్ని ధరిస్తుంది. తెల్లని హంస అమ్మవారి వాహనం. చేతిలో వీణను ధరిస్తుంది. అందుకే ఆ తల్లిని వీణాపాణిగా కొలుస్తారు.
 
లలితాత్రిపురసుందరీ..
 త్రిపుర త్రయంలో రెండో శక్తి లలితాదేవీ. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ అని పిలుస్తారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర ఆదిదేవతగా భక్తులు, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. లలితాదేవీ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకు గడను ధరించి, శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారిని పూజిస్తే మనిషిలో సోమరితనం పోతుందని నమ్మకం.
 
దుర్గా..
 దుర్గతుల్ని నాశనం చేసే శక్తిస్వరూపిణి దుర్గాదేవీ. దుర్గాదేవీ అష్టమితిథి రోజు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది. అందుకే లోకంలో ‘దుర్గా’ అని కీర్తించబడింది. ఆ అష్టమి దుర్గాష్టమిగా ప్రసిద్ధి పొందింది. దుర్గాదేవీ ఆది ప్రకృతి. పంచమహాస్వరూపాల్లో మొదటిది. అమ్మవారి శక్తి అనంతమైనది. దుర్గామాతా ఎప్పుడూ ఉగ్రస్వరూపంతోనే కనిపిస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శార్దూలాన్ని (పులి) అధిరోహించి త్రిశూలాన్ని ధరించి శక్తిస్వరూపిణిగా, శ్రీ దుర్గాదేవీగా భక్తులకు దర్శనమిస్తుంది.
 
మహిషాసురమర్దినీ..
 మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవీ అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుణ్ణి చంపి లోకాలకు మేలు చేస్తుంది. మహిషాసురుడిని చంపిన అనంతరం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిశారు. కాలక్రమంలో కనకదుర్గా కీర్తి పొందింది. సింహవాహనం మీద ఒకచేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది.
 
రాజరాజేశ్వరీ..
 దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవీగా అలంకరిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీలలితాదేవే సాక్షాత్తూ శ్రీరాజరాజేశ్వరీదేవీ. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరకు) చేతిలో ధరించి ఒకచేత అభయముద్రను చూపిస్తూ దర్శనమిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement