నల్లగొండ : ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న సిల బస్‌నే ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగాబోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యార్థుల్లో సృజనాత్మకతను దెబ్బతీసే గైడ్లు, వర్క్‌బుక్స్‌ను ఉపయోగించకుండా నియంత్రించేం దుకు, మోత బరువును తగ్గించే ందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం బేఖాతరు చేస్తున్నాయి. ఈ మేరకు కలెక్టర్ నేతృత్వంలో ప్రైవేటు యాజమాన్యాలు, జిల్లా విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది.
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడంలేదు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌నే ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలని ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడంలేదు. నిన్నమొన్నటి వరకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేటు పబ్లికేషన్స్, 8 నుంచి 10 తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సిలబస్‌నే బోధిస్తున్నారు. సిలబస్ అమలుతో పాటు గతంలో జారీ చేసిన నిరంతర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని వీటిని అతిక్రమించిన పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల అమలు, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అప్పగించారు.
వ్యతిరేకిస్తున్న యాజమాన్యాలు...
ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ సిలబస్‌ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్ధి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. కానీ ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నేరేడుచర్ల, దేవరకొండ, నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్ పట్టణాల్లో 47 ప్రైవేటు బుక్‌స్టాల్స్‌కు అనుమతిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 5,52,200 పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని చోట్ల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. సాంఘిక శాస్త్రం, తెలుగు సజ్జెక్టుల్లో మార్పులు చేర్పులు చేసినందున ఆ పుస్తకాలు రావడం కొంత ఆలస్యమైంది. కానీ ప్రస్తుతం అనుమతి పొందిన బుక్‌స్టాల్స్‌లో అన్ని పుస్తకాలు రెడీగానే ఉన్నాయి. కానీ ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా పాత పద్ధతిలోనే సొంతంగా తయారు చేసిన పుస్తకాలను విద్యార్థులకు అంటగడుతున్నారు.
రహస్య అమ్మకాలు..
విద్యాశాఖ నుంచి అనుమతి పొందిన హోల్‌సేల్ దుకాణాల నుంచి రిటైల్ వర్తకులు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేసి ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా విక్రయాలు చేస్తున్నారు. ఈ దందా ఓ వైపు సాగుతుండగానే... మరో వైపు ప్రైవేటు యాజమాన్యాలు తయారు చేసిన వర్క్‌బుక్స్, గైడ్లు, స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ పుస్తకాలను పాఠశాలల క్యాంటిన్‌లు, ఆరుబయట ప్రాంతాల్లో రహస్యంగా అద్దెకు దుకాణాలు తీసుకుని విక్రయాలు జరుపుతున్నారు.
నల్లగొండ పట్టణంలో పేరొందిన యాజమాన్యాలు బాహాటంగానే ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నా విద్యాశాఖ ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2500 లు వసూలు చేసి పుస్తకాలు అంటగడుతున్నారు. ఇదిలావుంటే పాఠ్యపుస్తకాల విషయంలో ఎవరి ఆదేశాల మేరకు నడుచుకోవాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలు ..
ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు 17 లక్షలు కాగా ఇప్పటి వరకు 14 లక్షల పుస్తకాలు వచ్చాయి. ఇంకా మూడు లక్షల పుస్తకాలు రావాల్సి ఉంది. వీటిల్లో సాంఘిక శాస్త్రం, తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. 59 మండలాల్లో వంద శాతం పుస్తకాలు చేరిన మండలాలు 11 మాత్రమే ఉన్నాయి. మిగిలిన మండలాలకు 90 నుంచి 95 శాతం వరకు పుస్తకాలు చేరాయి.
నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం
మిర్యాలగూడ టౌన్ : విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను బుధవారం బీసీ విద్యార్థి, ఎంఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్, ఎంఎస్‌ఎఫ్ జిల్లా కో ఆర్డినేటర్ పందిరి చందులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, టైయిలు, బెల్ట్‌లను విక్రయించవద్దని ఆదేశాలను జారీ చేసినప్పటికీ శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం పుస్తకాలను విక్రయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యను బోధిస్తూ పేద, మద్య తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డ బ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తిరుమలేష్, దైద సుధాకర్, రమేష్, వెంకట్, మనోహర్, శ్రీను, వంశీ తదితరులున్నారు.
బేఖాతర్..!
Published Wed, Jun 17 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement