హోలీ వేడుక.. తరలొస్తున్న నక్కల పిట్టలోళ్లు | Jalpalli Pittalagudem Ready For Holi Celebrations | Sakshi
Sakshi News home page

సంప్రదాయ ఉత్సవం

Published Tue, Mar 19 2019 12:07 PM | Last Updated on Fri, Mar 22 2019 1:37 PM

Jalpalli Pittalagudem Ready For Holi Celebrations - Sakshi

నిజాం నవాబు నిర్మించిన కొలను

పహాడీషరీఫ్‌: హోలీ వేడుకలకు జల్‌పల్లి పిట్టలగూడెం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నగరంలోని పార్థివాడలకు చెందిన నక్కల పిట్టలోళ్లు ఇక్కడే హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మూడు నాలుగు రోజులు గడుపుతారు. వేలాదిగా తరలివచ్చే వీరితో ఈ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. ఇప్పటికే ఇక్కడికి తరలొస్తున్న పార్థీలు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని, తమ పూర్వీకుల సమాధులకు రంగులద్దుతున్నారు. తమ కుల యువతి అమీర్‌బాయి, పూర్వీకుల సమాధులకు పూజలు నిర్వహించడం, వంశ పూజలు చేయడం ఈ హోలీ వేడుకల్లో ప్రత్యేక ఘట్టంగా చెప్పుకోవచ్చు. హోలీకి ముందు రోజు రాత్రి కామనదహనం చేసి, పండగ రోజు రంగులద్దుకొని స్థానిక జల్‌పల్లి పెద్ద చెరువులో స్నానాలు చేస్తారు. నక్కల పిట్టలోళ్ల కులంలో శక్తి, చౌకట్, నౌకడ్, కాలివాలా, ఇస్లీవాలా తదితరులు ఎక్కువగా ఉంటారు. వీరంతా ఇక్కడే వంశపూజ నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా ఒక్కో కుటుంబం 5–10 పొట్టేళ్లను బలిచ్చి వేడుకలు జరుపుకుంటారు. మొత్తం మీద దాదాపు వెయ్యి వరకు పొట్టేళ్లను ఈ వేడుకల సందర్భంగా బలిస్తారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పహాడీషరీఫ్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీ తరఫున నీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ మహ్మద్‌ సాబెర్‌ అలీ తెలిపారు. 

నిజాం మనసు దోచిన అమీర్‌బాయి...  
నిజాం నవాబుల హయాంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన నక్కల పిట్టలోళ్లు జల్‌పల్లి అటవీ ప్రాంతంలో జంతువుల వేట సాగిస్తూ జీవించేవారు. అప్పట్లో అడవికి వేటకు వచ్చిన నిజాం నవాబుకు ఈ తెగకు చెందిన అమీర్‌బాయి అనే యువతి తీయని ఫలాలు అందజేసింది. వాటిని ఆస్వాదించిన నిజాం నవాబు ఆమె ప్రేమను సైతం కోరాడు. దీనికి ఆమె కూడా అంగీకరించడంతో... అప్పటి నుంచి నిజాం నవాబుకు నక్కల పిట్టలోళ్లు పండ్లు ఇచ్చేవారు. అమీర్‌బాయి కోసం నిజాం కొలను తవ్వించి భూగర్భంలోనే రాతి కట్టడంతో స్నానాల గదులు నిర్మించాడు. అమీర్‌బాయి 40ఏళ్లలోపే మృతి చెందగా కొలను సమీపంలోనే ఆమెను సమాధి చేశారు. ఇక్కడే నక్కల పిట్టలోళ్లు నివాసం ఉండేందుకు అప్పట్లో నిజాం నవాబు వందల ఎకరాల భూమిని ఇనామ్‌గా ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇక్కడ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ భూములు కాలక్రమేణా అన్యాక్రాంతమవుతున్నాయి. హోలీ తర్వాత రోజు పార్థీలు అమీర్‌బాయి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడే అంత్యక్రియలు...   
అప్పట్లో జల్‌పల్లి పిట్టలగూడెం ప్రజలతో కళకళలాడేది. ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని స్థానికంగా తోటల్లో పండ్లు పండిస్తూ జీవించేవారు. కాలక్రమేణా వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్థీవాడలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు ప్రస్తుతం పురానాపూల్, రాజన్నబావి, శక్కర్‌గంజ్, ఛత్రినాక,  హమాంబౌలి, డబీర్‌పురా, సరూర్‌నగర్, కాచిగూడ, అమీర్‌పేట, అబిడ్స్, బేగంబజార్, బోయిగూడ, చిక్కడపల్లి, లాల్‌దర్వాజా, ఎల్‌బీనగర్, మొజంజాహి మార్కెట్, గన్‌ఫౌండ్రీ సహా వరంగల్, నిజామాబాద్, మెదక్‌ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ ఆయా కుటుంబాల్లో ఎవరూ మరణించినా జల్‌పల్లి పిట్టలగూడెంకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తారు.  

ఆనవాయితీ...  
ప్రతిఏటా పిట్టలగూడెంలో హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని మా పూర్వీకులకు పూజలు చేస్తాం. మా తాతల కాలం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. మా కులస్తులకు ఇక్కడే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తే బాగుంటుంది.  – రాజు, బషీర్‌బాగ్‌

ఐక్యతకు చిహ్నం  
అమీర్‌బాయి పేరు మీదుగానే హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ తర్వాత రోజు ఆమె సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. వంశ పూజ పెద్ద ఎత్తున జరుపుకుంటాం. ఈ వేడుకలకు ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. విద్యుత్, నీటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నాం. నిజాం నవాబు ఇచ్చిన భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. మాలోని ఐక్యతకు ఈ వేడుక చిహ్నంగా నిలుస్తుంది.      – ఎన్‌.రవి, లాల్‌దర్వాజా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement