సీఎల్పీ నేతగా జానా ఔట్!
* ప్రభుత్వంపై మెతక వైఖరితో అధిష్టానం అసంతృప్తి
* కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పదవి నుంచి జానారెడ్డికి అధిష్టానం
* ఉద్వాసన పలికే అవకాశముందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
* టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై జానా మెతకవైఖరిని ప్రదర్శిస్తున్నారని అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది.
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) పదవి నుంచి జానారెడ్డికి అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశముందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత జానారెడ్డి మెతకవైఖరిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షంలో మెజారిటీ సభ్యులు ఆయన వ్యవహారశైలి పట్ల ఆగ్రహంగా ఉన్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదించారు. వీలైతే తదుపరి శాసనసభ సమావేశాలు ప్రారంభం నాటికి ఆయన స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నేతను ఎంపిక చేయాలని కూడా సోనియాకు వివరించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలోనూ, తెలంగాణ వ్యాప్తం గా కాంగ్రెస్ నుంచి వలసలను నిరోధించడంలోనూ సీఎల్పీ నేతగా ఆయన వైఫల్యం చెందారని పార్టీ భావి స్తోంది. జానారెడ్డిని తొలగించాలంటూ డజనుమందికిపైగా ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సచివాలయం తరలింపు, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల వంటి అంశాల్లో విపక్షనేత కనీస స్థాయిలోనూ స్పందించలేదని ఫిర్యాదులందా యి. గత శాసనసభ సమావేశాల సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ వంటి వారు సీఎల్పీనేత తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాల్లో దూకుడుగా వెళ్లడం బాగుండదని పార్టీ అధిష్టానం వారికి నచ్చజెప్పింది. ఆ తరువాతా ఆయన వైఖరిలో మార్పు లేదని పార్టీ భావిస్తోంది. విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలు వంటివాటిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలు చేసిన సూచనలను జానా పెడచెవిన పెట్టారన్న ఆరోపణలున్నాయి. ‘అసెంబ్లీలో ప్రతిపక్షం అంటే ప్రభుత్వం భయపడాలి. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం రోజుకో పిచ్చి నిర్ణయంతో ప్రజలను మభ్యపెడుతూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.
అయినా సీఎల్పీ నేత మౌనంగా ఉండటం ఆశ్చరాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్ ఇంత నిస్తేజంగా ఉంటే పార్టీ ఫిరాయించకుంటే ఎవరైనా ఏం చేస్తారు.’ అని పార్టీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి ఒకరు అన్నారు. సచివాలయం మార్పు, ఛాతీ ఆసుపత్రి తరలింపు, పార్టీ ఫిరాయింపులు, రైతుల ఆత్మహత్యలు, భూముల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి అంశాలపై సీఎల్పీ మౌనంగా ఉండటం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహానికి కారణం అవుతున్నదంటూ పలువురు సీనియర్‌నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.