రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరికాదు: జానారెడ్డి
చౌటుప్పల్: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన సాగడంలేదన్నారు.
తెలంగాణ సాధనకోసం ముందుండి పోరాటాలు చేసిన కోదండరాం వంటి నాయకుడిని అరెస్ట్ చేయడం సరైనది కాదన్నారు. నిరుద్యోగ ర్యాలీకి వెళ్లకుండా గ్రామస్థాయి నుంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి నిర్బంధించడం శోచనీయం అన్నారు. అక్రమ అరెస్ట్‌లను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వ తీరును ఖండించాలని కోరారు. ప్రభుత్వ పాలనా తీరు ప్రజలకు త్వరలోనే అర్థమవుతుందన్నారు.