ప్రశ్నిస్తే దుర్మార్గులంటారా?: జానారెడ్డి
ప్రతిపక్షాన్ని తూలనాడటం కేసీఆర్ మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను విస్మరించినందువల్లే తమను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారని, ప్రస్తుతం ఆ సమస్యలను సరిచేయాలని అడిగితే దుర్మార్గులు, దుశ్శాసనులని తూలనాడతారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపక్షనేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సీఎం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అధికార దర్పాన్ని పక్కన పెట్టి, గతంలో జరిగిన తప్పులను ప్రభుత్వం సరిచేయాలని, అది ధర్మమని పేర్కొన్నారు.
లేదంటే తమను పక్కన పెట్టినట్లే టీఆర్‌ఎస్‌ను కూడా ప్రజలు పక్కన పెడతారన్నారు. సమస్యలపై అసూయ, ద్వేషంతో కాకుండా సామాజిక అభివృద్ధి కోణంలో చూడాలని, నిందలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. సోమవారం విద్యుత్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అనంతరం జానా మాట్లాడారు. ‘గతంలో అనేకమార్లు ప్రభుత్వాలు మారాయి. రెండు సీట్లున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నాలుగు వందల సీట్ల నుంచి కాంగ్రెస్ విపక్షంలోకి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే. వాటిని గౌరవించాలి తప్పితే హేళన చేయరాదు’’ అన్నారు. విద్యుత్ సమస్యకు కాంగ్రెస్ కారణం కాదన్నారు. విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేం దుకు అధికార పక్షానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
విభజన చట్టం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ వాటా ఇవ్వాల్సిందేనని, లేదంటే కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. విద్యుత్ వాటాలపై ప్రజల మధ్య విద్వేషాలు పెరగకముందే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రాల మధ్య తగాదాలు తీర్చేందుకు అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని, అఖిలపక్షంగా వెళ్లి ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు.
మూడేళ్లలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదని ఈ సమయంలో టీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు. దాంతో జానారెడ్డి సీఎం కుర్చీని చూపిస్తూ... ‘నేనెందుకు అక్కడ లేనంటే ఏం చెబుతాం’ అని అన్నారు! విద్యుదుత్పత్తి, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, రాష్ట్రానికి వాటా దక్కేందుకు న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ బదులిచ్చారు.