'అధ్యయనం చేసి బడ్జెట్ ఇచ్చినట్లు లేదు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రతిపక్ష నేత జానారెడ్డి తప్పుబట్టారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జానారెడ్డి.. బడ్జెట్ ప్రసంగంలోని వివరాలన్నీ గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. బడ్జెట్ కు సంబంధించి మరింత సమయం తీసుకుని లెక్కలు సరిచేయడం ప్రభుత్వం బాధ్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పథకాలకు కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని జానా ప్రశ్నించారు. ప్రస్తుతం నిబంధనల మేరకు రూ.11 వేల కోట్ల నిధులు మాత్రమే అప్పు తీసుకోవచ్చన్నారు.
భూములు అమ్మితే రూ.6,500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఇది అసలు సాధ్యమేనా? అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో భూముల అమ్మకం సాధ్యమయ్యే అంశమేనా?అంటూ జానారెడ్డి ఎద్దేవా చేశారు.