
హన్మకొండ: లంచం ఇచ్చిన వారికి శిక్ష విధించేలా రాజ్యసభలో తీసుకున్న నిర్ణయం మెడ మీద తలకాయ ఉన్నోడు తీసుకునేది కాదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను జ్వాలా అవినీతి వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలో శుక్రవారం అశ్వరథంపై ఊరేగించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేపీ మాట్లాడారు.
రాజ్యసభలో ఆమోదం పొందిన అవినీతి నిరోధక సవరణ బిల్లుపై ఆయన స్పందిస్తూ లంచం కావాలని ఎవరూ ఇవ్వరని, సంపన్నులు, పలుకుబడి ఉన్నవారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులవుతున్నాయని, పేదలు, సామాన్యులు ఆఫీసుల చూట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. పనుల కోసం లంచాలు ఇచ్చే వారికి శిక్ష విధించడం సరికాదన్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి గత్యంతరం లేక లంచం ఇచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పని నిర్ణీత సమయంలోపు చేయని అధికారులు, ఉద్యోగులకు జరిమానాలు విధిస్తే లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment